Karnataka HC denied Rs 6 lakh month alimony to woman : విడాకుల కేసుల్లో భరణం ఇప్పించాలని భార్య కోర్టును ఆశ్రయించడం సహజమే.అయితే ఆ భరణం ఊహించనంత మొత్తంలో ఉంటే మహిళా  న్యాయమూర్తులు సైతం సమర్థించలేరు. కర్ణాటక హైకోర్టులో ఓ భరణం పిటిషన్ పై విచారణలో జస్టిస్ కన్నెగంటి లలిత కీలక  వ్యాఖ్యలు చేశారు. 


కర్ణాటకలో భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ తనకు భరణంగా ప్రతి నెలా రూ. 6.16 లక్షలు ఇప్పించాలని ఓ మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ జస్టిస్ కన్నెగంటి లలిత ముందు విచారణకు వచ్చింది. ఇంత మొత్తం భరణం ఎలా ఇస్తారని .. ఓ మహిళ నెల ఖర్చు ఇంత అవుతుందా అని  న్యాయమూర్తి .. ఆ మహిళ తరపు లాయర్ ను ప్రశ్నించారు. లాయర్ ఈ ఖర్చుల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇల్లు, తిండికి రూ. 40వేలు.. వాచీలు, గాజులు, చెప్పులకు రూ. 50వేలు.. వైద్యం, కాస్మోటిక్స్ రూ. 4-5 లక్షలు అవసరం అవుతాయని వాదించారు. ఈ వాదన హైకోర్టు న్యాయమూర్తికి మరింత ఆగ్రహం తెప్పించింది. ఇంత ఖర్చు చేయాలనుకుంటే ఆమెనే సంపాదించుకోమనాలని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అయితే తాము అడిగిన  లెక్క కరెక్టెనని..  మహిళ   భర్త పది  వేల రూపాయల షర్టు.. అంత కంటే ఖరీదైన చెప్పులు ధరిస్తారని మహిళ  లాయర్ హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మహిళ లాగే లాయర్ కూడా వాదిస్తూండటంతో  కోర్టు నుంచి ఆదేశాలు పొందాలనుకుంటే సరైన అంకెలతో రావాలని లేకపోతే పిటిషన్ ను డిస్మిస్ చేస్తామని న్యాయమూర్తి మహిళ తరపు లాయర్ కు స్పష్టం చేశారు. అయితే తర్వాత మహిళ లాయర్ మరికొంత భరణం తగ్గించుకునేందుకు సిద్ధమనేనని బేరం ఆడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా లాయర్ పై జస్టిస్ మండిపడ్డారు. మీ క్లయింట్‌కు తెలియకపోతే మీరైనా చెప్పాలన్నారు. బేరం ఆడటానికి కోర్టు వేదిక కాదని స్పష్టం చేశారు. ఖర్చులపై సరైన వివరాలు చెప్పేందుకు కోర్టు ఓ అవకాశం ఇస్తుదని లేకపోతే నేరుగా డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. అయినా ఏమీ  తేల్చకపోయే సరికి.. రీజనబుల్‌గా లేదన్న కారణం చేత పిటిషన్ ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.   



విడాకుల తర్వాత భరణం కోసం మహిళలు అసాధారణ రీతిలో డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్లడం తరచూ జరుగోతంది. భర్త ఆర్థిక పరిస్థితి.. మహిళ అవసరాలను బట్టి కోర్టులు భరణం చెల్లించాలని ఆదేశాలు ఇస్తూ ఉంటాయి. కర్ణాటక కేసులో మరీ అతిగా ఉండటంతో జస్టిస్ కన్నెగంటి లలిత పిటిషన్ రీజనబుల్‌గా లేదని తిరస్కరించారు.