Central Minister Suresh Gopi About Films: చాలామంది పదవులు అనుభవించేందుకు రాజకీయాల్లోకి వస్తుంటారు. మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీల మీద అలుగుతారు, పార్టీలు మారిపోతారు. కానీ, కేంద్రమంత్రి సురేశ్ గోపీ మాత్రం అలా కాదు. తను పదవి వదులుకునేందుకైనా సిద్ధం అంటున్నారు. అది కూడా సినిమాల్లో నటించేందుకు. తనకు సినిమాలు అంటే చాలా ఇష్టం అని, దాని కోసం కేంద్ర మంత్రి పదవి వదులుకునేందుకైనా సిద్ధం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఏకైక ఎంపీ..
సురేశ్ గోపి మలయాళ నటుడు. మలయాళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఈయన ప్లే బ్యాక్ సింగర్ కూడా. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళలోని త్రిస్సూర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ నుంచి కేరళలో గెలిచిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. దీంతో మోడీ 3.0 కేబినెట్ లో గోపికి మంత్రి పదవి ఇచ్చారు. పెట్రోలియం, టూరిజం శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరిస్తున్నారు గోపి.
22 సినిమాలు ఒప్పుకున్నాను..
కేరళ ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ తిరువనంతపురం జరిగింది. ఆ మీటింగ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన సురేశ్ గోపి సంచలన కామెంట్స్ చేశారు. తనకు సినిమాలే ముఖ్యం అని, దాని కోసం పదవినైనా వదిలేసుకుంటానని చెప్పుకొచ్చారు. "సినిమాలంటే నాకు చాలా ఇష్టం. సినిమాలు లేకపోతే నేను చచ్చిపోతాను. సినిమాల కోసం మంత్రి పదవినైనా వదులుకుంటాను. వొట్టకోంబన్ అనే సినిమాకి సంతకం చేశాను సెప్టెంబర్ 6 నుంచి షూటింగ్ మొదలవుతుంది. దానికోసం కేంద్రమంత్రి అమిత్ షాని పర్మిషన్ అడిగాను. ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. సమాధానం వచ్చినా రాకపోయినా సినిమా చేస్తాను. ఇప్పటికే 22 సినిమాలు ఒప్పుకున్నాను. ఒకవేళ సినిమాలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్తే నాతో పాటు నలుగురు ఆఫీసర్లను పెట్టుకుని రాజకీయంగా చేయాల్సిన బాధ్యతలు నిర్వహిస్తాను. దానికి షూటింగ్ సెట్స్ లో ఒక ఆఫీస్ సెటప్ కూడా ఏర్పాటు చేయించుకుంటాను. నన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే మంచి జరిగిందని ఆనందపడతాను" అని అన్నారు గోపి.
వాళ్ల మాటకు ఎదురు చెప్పలేక..
పెద్దల మాటకు ఎదురు చెప్పలేకే తాను మంత్రి పదవిని తీసుకున్నట్లు చెప్పారు గోపి. వాళ్ల మాటలు తాను కచ్చితంగా వింటానని, కానీ, సినిమాల లేకుంటే చచ్చిపోతాను కాబట్టి సినిమాల్లో నటిస్తాను అని అన్నారు ఆయన. ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేయాలనే అనుకున్నాను తప్ప.. మంత్రి పదవి ఆశించలేదని, ఆశించను కూడా అని చెప్పారు గోపి. అందుకే, ఒకవేళ కేబినెట్ నుంచి తొలగించినా ఆనందమే అని అన్నారు. అమిత్ షా పర్మిషన్ ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు గోపి. తనను ప్రజలు నమ్మి గెలిపించారని, వాళ్లకు సేవ చేసేందుకు ఎంపీగా కొనసాగుతానని చెప్పారు. తన మంత్రి పదవిపై, సినిమాల్లో నటించడంపై త్వరలోనే ఒక నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన.
Also Read: చిరంజీవి బర్త్‌డే రోజున విష్ చేయడంలో అల్లు అర్జున్ తీరు మారిందా? ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు.