Lalu Yadav Kidney Transplant:
లాలూ కూతురి పోస్ట్..
కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు..ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. కిడ్నీ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు చెప్పారు. ఇందుకోసం ఆయన కూతురు రోహిణీ ఆచార్య ముందుకొచ్చారు. తన కిడ్నీని నాన్నకు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇప్పుడు ప్రీ సర్జరీ ఫోటో ట్విటర్‌లో షేర్ చేశారు. "రెడీ టు రాక్ అండ్ రోల్" అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. "నాకు గుడ్ లక్ చెప్పండి" అని ట్వీట్ చేశారు. రోహిణీ ఆచార్య..లాలూ రెండో కూతురు. సింగపూర్‌లో స్థిరపడ్డారు. అమ్మ నాన్నపై ఉన్న ప్రేమను తరచూ ఇలా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే ఓ ఎమోనషనల్ పోస్ట్ పెట్టారు. "మా అమ్మ, నాన్నలు నాకు దైవంతో సమానం. వాళ్ల కోసం ఏదైనా చేసేందుకు నేను సిద్ధం" అని పోస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడి గురించి ప్రశ్నించగా.."నా శరీరంలోని ఓ చిన్న ముక్కను నాన్నకు ఇస్తున్నానంతే" అని సింపుల్‌గా సమాధానమిచ్చారు.
నాన్నకు ప్రేమతో...
లాలూ అక్టోబర్‌లో సింగపూర్ వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. వారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని లాలూకు సూచించారు. దీంతో తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు రోహిణి ముందుకొచ్చారు. అయితే తన ప్రాణం కాపాడుకొనేందుకు కుమార్తె కిడ్నీని స్వీకరించేందుకు లాలూ నిరాకరించినట్లు సమాచారం. కానీ, కుమార్తె ఒత్తిడి చేయడంతో పాటు, కుటుంబ సభ్యుల కిడ్నీని అమరిస్తే శస్త్రచికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో ఆయన అంగీకరించాల్సి వచ్చిందట. గత కొన్నేళ్లుగా తన కిడ్నీ, గుండె సమస్యలకు లాలూ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు సెప్టెంబర్‌లోనే కోర్టు నుంచి అనుమతి వచ్చింది. వైద్య చికిత్స కోసం ఆయన విదేశాలకు వెళ్లొచ్చని దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబర్ 10 నుంచి 25 వరకూ వైద్య చికిత్స కోసం సింగపూర్ వెళ్లేందుకు
అనుమతి ఇవ్వాలని లాలూ.. కోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఐఆర్‌సీటీసీ (IRCTC) కుంభకోణంలో లాలూ ప్రసాద్‌పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం లాలూ బెయిల్‌పై ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్‌సీటీసీకి చెందిన రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించడంలో అవినీతికి పాల్పనట్టు సీబీఐ ఆరోపించింది. రాంచి, పూరీలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లను 2006లో ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో అక్రమాలకు పాల్పడ్డారని రబ్రీ దేవీ, లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్‌పై సీబీఐ అభియోగాలు మోపింది.
Also Read: Live Glacier Melting: గ్లేషియర్స్ కరిగిపోవడం ఎప్పుడైనా చూశారా? క్షణాల్లో మాయమైన మంచు