ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐకు లెటర్ రాశారు ఎమ్మెల్సీ కవిత. ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాననని అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశానన్నారు. దానిలో తన పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేశారు.
ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో సీబీఐకి అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. "సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను." అని పేర్కొన్నారు.
ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందిస్తూ సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన విషయం విధితమే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉన్నదని తెలిపారు.
దాంతో తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఈ నెల 6న తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో ఏదో ఒక రోజు సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు.
తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికి గానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు.