గర్బం ధరించడం ఓ వరం. గర్భస్థ పిండం ఆరోగ్యంగా ఎదిగి, సంపూర్ణం ఎదిగిన బిడ్డగా జన్మించాలంటే ఎన్నో పోషకాలు అవసరం. వాటిల్లో ముఖ్యమైనది ఫోలిక్ యాసిడ్. దీన్ని ట్యాబ్లెట్ల రూపంలో ఆరు వారాల గర్భం నుంచే తీసుకోమని సిఫారసు చేస్తారు వైద్యులు. ఎందుకు ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు అంత ముఖ్యం? పిండ దశలో ఉన్నప్పుడే తగినంత ఫోలిక్ యాసిడ్ అందితే ఎలా అవకరాలు లేకుండా బిడ్డ పుట్టడానికి అవకాశం ఎక్కువ. పిండ దశలోనే న్యూరల్ ట్యూబ్ ఏర్పడుతుంది.దీన్నుంచే మెదడు, వెన్నుపాము వంటివి ఏర్పడతాయి. ఈ న్యూరల్ ట్యూబ్ ఏర్పడడటానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. అందుకే మొదటి మూడు నెలల్లోనే ఫోలిక్ యాసిడ్ కచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.  ఇది పుష్కలంగా గర్భస్థ పిండానికి అందితే మెదడు, వెన్ను పాము లోపాలు ఏర్పడవు. 


విటమిన్ బి9ను ఫోలేట్ అంటారు. దీనికి ట్యాబ్లెట్ల రూపమే ఫోలిక్ యాసిడ్. మాత్రలు, సిరప్ రూపంలో ఇది లభిస్తుంది. ఇది గర్భిణులకు, గర్భస్థ శిశువుకు చాలా ముఖ్యం. ఇది చర్మం, వెంట్రుకలు, గోళ్లు వంటివి ఏర్పడటానికి కూడా అవసరం. ఇది లోపిస్తే గర్భస్థ శిశువు ఎదుగుదల తగ్గిపోతుంది. అందుకే ఫోలిక్ యాసిడ్ సిఫారసు చేస్తారు వైద్యులు. 


మనకూ అవసరమే...
గర్భస్థ శిశువుకే కాదు పిల్లలకు, పెద్దలకు కూడా ఫోలిక్ యాసిడ్ తగినంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం ద్వారా దీన్ని తీసుకుంటే మంచిది. ఇది తగ్గితే ఒత్తిడి పెరిగిపోతుంది. హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడుతుంది. మంచి బ్యాక్టిరియా తయారీకి సహకరిస్తుంది. ఇది లోపిస్తే వెంట్రకలు తెల్లబడడం, నోరు, నాలుకకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలు మందకొడిగా మారతారు. చర్మం మెరవాలన్న, వెంట్రుకలు చక్కగా ఎదగాలన్నా ఫోలిక్ యాసిడ్ అవసరం. 


ఏం తినాలి?
గర్భిణకులకు మాత్రలు, సిరప్ రూపంలో ఫోలిక్ యాసిడ్ ఇస్తారు వైద్యులు. కానీ మిగతా వారు మాత్రం ఆహారం ద్వారానే దీన్ని పొందాలి. ప్రతి రెండు రోజులకోసారి పాలకూరను తినాలి. పాలకూర పప్పు లేదా పాలకూర వేపుడు చేసుకోవాలి. పాలకూర రైస్ కూడా టేస్టీగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ నిండుగా ఉండే ఆకుకూర పాలకూర. అలాగే మాంసాహారంలో కాలేయం, కిడ్నీల్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. పొట్టు తీయని ధాన్యాల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ పొట్టు తీసిన పప్పులనే వాడుతున్నారు. మినపప్పు, పెసరపప్పు వంటివి పొట్టుతోనే కొని వాడడం మంచిది. పొట్టు పెసరపప్పును అలాగే పూర్తిగా వాడుకోవచ్చు. కానీ పొట్టు మినపప్పులో 60 పొట్టును తొలగించి మిగతా పొట్టును అలా ఉంచి రుబ్బుకోవచ్చు. మినప పొట్టు అధికమైతే కొందరిలో అరగక పొట్ట నొప్పి వస్తుంది. 


Also read: ఈ లక్షణాలు కొన్ని సెకన్ల పాటూ కనిపించి వెళ్లిపోతున్నాయా? అయితే మీ బ్రెయిన్‌కు మినీ స్ట్రోక్ వచ్చినట్టే





















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.