L&T Letter to Telangana Government on Medigadda Barriage Damage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనకు సంబంధించి నిర్మాణం సంస్థ ఎల్ అండ్ టీ (L&T) తెలంగాణ నూతన ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని, దెబ్బతిన్న పియర్స్ ను పునరుద్ధరించే పని తమది కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వమే మరమ్మతులకు అయ్యే ఖర్చు చెల్లించాల్సి ఉంటుందని, అందుకోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని తెలిపింది. కాగా, బ్యారేజీ కుంగినప్పుడు మాత్రం నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు అధికారికంగా ప్రకటించారు. సదరు నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటించింది. తాజాగా, ఆ బాధ్యత తమది కాదంటూ కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వర్లుకి లేఖ రాసింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖను కింది స్థాయి ఇంజినీర్లకు పంపించారు.
రూ.55.75 కోట్ల ఖర్చు
బ్యారేజీ కుంగిన చోట పియర్స్, పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉంటుంది. దీనికి రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని సంస్థ అంచనా వేసింది. ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని ఎల్అండ్ టీ సంస్థ ఈ నెల 2న కాళేశ్వరం ఈఎన్సీకి లేఖ రాసింది. దీన్ని ఈ నెల 5 ఆయన సంబంధిత ఎస్ఈకి పంపారు. అయితే, దెబ్బతిన్న బ్లాక్, పియర్స్ పునరుద్ధరించడానికి సుమారు రూ.500 కోట్ల వరకూ అవసరమవుతాయని నీటి పారుదల శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తూ వచ్చింది. కాగా, నీటిని పూర్తిగా మళ్లించి ఎంత మేర నష్టం జరిగిందో, పునరుద్ధరణ పని ఏం చేయాలనే దానిపై ఓ స్పష్టత వస్తుందని, ఖర్చు కూడా కచ్చిత అంచనా వెయ్యొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఏడో బ్లాక్ అక్టోబర్ 21న కుంగింది. మరుసటి రోజే ప్రాజెక్ట్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సహా సంబంధిత ఇంజినీర్లు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వంతెనను పరిశీలించారు. ఈ క్రమంలో బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని, పునరుద్ధరణ పని పూర్తిగా నిర్మాణ సంస్థే చేపడుతుందని బ్యారేజీ ఈఈ తిరుపతిరావు పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. వంతెన డిజైన్ పూర్తిగా అధికారులదని, పునరుద్ధరణ పని తాము చూసుకుంటామని L&T సంస్థ మేనేజర్ కూడా అదే రోజు ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ, ఇప్పుడు పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ లేఖ రాయడం సంచలనం కలిగించింది.
లేఖలో ఏం చెప్పారంటే.?
'బ్యారేజీ నిర్మాణంలో భాగంగా చేసిన పనికి తగ్గట్లు బిల్లు చెల్లించే పద్ధతి (నాన్ ఈపీసీ)లో ఒప్పందం జరిగింది. నీటి పారుదల శాఖ డిజైన్ అందించింది. 2018, ఆగస్ట్ 25 నాటికి పని పూర్తి చేయాల్సి ఉండగా, 2020 జూన్ 29 నాటికి పని పూర్తైంది. రూ.3,062.79 కోట్లకు ఒప్పందం జరగ్గా, టెండర్ విలువ 2.7 శాతం కంటే ఎక్కువ కోట్ చేయడం, పెరిగిన ధరలు, ఇలా మొత్తంగా కాంట్రాక్టర్ రూ.3,348.24 కోట్లు చెల్లించారు. ఒప్పందం మేరకు పని పూర్తైనట్లు 2021, మార్చి 15 సంబంధిత ఎస్ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అయితే, ఒప్పందం ప్రకారం సివిల్ పనులకు డిఫెక్ట్ లయబిలిటీ పిరియడ్ (ఏదైనా నష్టం వాటిల్లితే బాధ్యత వహించే సమయం) 2 ఏళ్లుగా ఉంది. తాము, 2020, జూన్ 29 నుంచి, 2022, జూన్ 29 వరకూ డిఫెక్ట్ లయబిలిటీ టైంగా పేర్కొన్నాం. అధికారులు కూడా 2021, మార్చి 15న పని పూర్తై స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.' అని లేఖలో వివరిస్తూ, దీనికి సంబంధించిన ఆధారాలు సైతం జత చేశారు. కాగా, ఈఎన్సీ నుంచి గత అక్టోబర్ 25న, నవంబర్ 25న వచ్చిన లేఖల ఆధారంగా కొత్త పని చేపట్టాలంటే మళ్లీ ప్రత్యేక ఒప్పందం ఉండాలని, ఇది సైతం పరస్పర అవగాహనతో ఉండాలని L&T స్పష్టం చేసింది. కాఫర్‌డ్యాం నిర్మాణానికి రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఇది కూడా జీఎస్టీ, సీనరేజి ఛార్జీలు కాకుండా అని తెలిపింది. నిర్మాణ సమయంలో మెటీరియల్ లభ్యత, ధరల పెరుగుదల కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
పరిశీలించిన కేంద్ర బృందం
అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగగా, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందాన్ని పంపింది. అనిల్ జైన్ నాయకత్వంలోని ఈ బృందం బ్యారేజీని పరిశీలించి పియర్స్ కుంగినట్లు గుర్తించి, దానికి గల కారణాలను అన్వేషించింది. కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారులతో అప్పుడు భేటీ అయిన సమయంలోనూ బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని ఇంజినీర్లు తెలిపారు. తాజాగా, పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న L&T లేఖతో అధికారులు ఏం చేస్తారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.