సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వస్తేనే లొంగిపోతానంటూ ఓ దొంగ డిమాండ్‌ విన్న పోలీసులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌లోని సూరారం కాలనీలో ఓ ఇంట్లో చోరీకి యత్నించాడో వ్యక్తి. ఆ ప్లాన్ కాస్త బెడిసికొట్టింది. స్థానికులు రావడంతో చోరీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. దొరికిపోతానేమో అన్న కంగారులో స్థానికంగా ఉన్న చెరువు మీదుగా పరుగెత్తాడు. అయినా స్థానికులు వదల్లేదు. 


దొంగ పరుగెత్తుతున్నాడని తెలుసుకున్న స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు దొంగ కూడా కష్టపడ్డాడు. ఇంతలో పక్కనే ఉన్న చెరువులోకి దూకి అవతలి ఒడ్డుకు చేరుకోవాలనుకున్నాడు. ఏమైందో ఏమో కానీ అలా వెళ్లలేకపోయాడు. 


చెరువులో ఈత కొడుతూ మధ్యలో ఉన్న నీళ్లు లేని ప్రాంతంలో నిలబడిపోయాడు. అతన్ని పట్టుకోవడానికి స్థానికులు చెసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రం నుంచి మొదలైన ఈ హైడ్రామా... రాత్రంతా కొనసాగింది. చికటి పడుతుండగానే పోలీసులు కూడా వచ్చారు. 


పోలీసులు వచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. చెరువు మధ్యలో నిల్చొని ఉన్న దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. బయటకు రావాలని మైక్‌లో చెప్పారు. ఎవరూ ఏం చేయరని చెప్పారు. కానీ దొంగ వినలేదు. తాను లొంగిపోవాలంటే సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చి హామీ ఇస్తేనే వస్తానని చెప్పారు. 


చెరువులో చిక్కుకున్న దొంగ డిమాండ్లు విని స్థానికులతోపాటు పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఓ వైపు రాత్రి కావడం, మరోవైపు చలి పెరగడంతో దొంగను రిక్వస్ట్ చేసి బయటకు రప్పించే ప్రయత్నం చేశారు. చివరకు స్థానికులే చెరువులోకి దిగి దొంగను పట్టుకున్నారు. అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.