ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిరసనలు తెలియజేసుకోవచ్చని హైదరాబాద్‌ పోలీసులు అనుమతి ఇచ్చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే అది ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. 


ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌, ఎన్టీఆర్ స్టేడియంను సందర్శించిన శ్రీనివాస్ రెడ్డి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ధర్నా చౌక్‌ వద్ద నిరసనలు తెలియజేసుకోవచ్చని తెలిపారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా ఆందోళనలు చేపట్టవచ్చని అన్నారు. 


ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్లోజ్ చేసింది. అక్కడ నిరసనలు తెలియజేయడానికి వీల్లేదని చెప్పింది. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. దీనిపై కోర్టుల్లో కేసులు కూడా వేశాయి ప్రతిపక్షాలు. ఇప్పటికీ వాటిపై విచారణ సాగుతోంది. అయితే ఈ పెండింగ్ కేసులపై న్యాయపరంగానే ముందుకెళ్తామన్నారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. 


ఇందిరా పార్క్ వద్ద ఉండే ధర్నా చౌక్‌కు చాలా ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి ధర్నా చౌక్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎత్తేసింది. అక్కడ ఎలాంటి ధర్నాలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అప్పట్లో మిర్చి రైతుల కోసం భారీ ఎత్తున ఆందోళనలకు ప్రతిపక్షాలు ప్లాన్ చేశాయి. దీనికి ధీటుగా ప్రభుత్వం కూడా ప్రతి చర్యకు దిగింది. భారీగా పోలీసులను మోహరించింది. స్థానికులు కూడా అక్కడ ధర్నాలు వద్దని తేల్చి చెప్పారు. వాళ్లు కూడా పోటీగా నిరసన చేపట్టే ప్రయత్నం చేశారు. 


ఒకవైపు పోలీసులు, మరోవైపు ప్రతిపక్షాలు, రైతులు, ఇంకొకవైపు స్థానిక ప్రజలు ఇలా ముగ్గురూ పోటాపోటీ చర్యలకు దిగారు. దీంతో అప్పటి కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్‌ వద్ద ఎలాంటి ఆందోళనలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 


దీంతో ప్రతిపక్షాలు ధర్నా చౌక్ కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టులను ఆశ్రయించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఆందోళనలకు జంతర్‌మంతర్ ఉందని తెలంగాణలో ధర్నా చౌక్ ఎత్తివేయడాన్ని తప్పుపట్టారు. ధర్నా చౌక్ వద్ద ఎలాంటి నిరసన చేపట్టాలన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టుల నుంచి ఆదేశాలు ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ధర్నా చౌక్‌లో నిరసనలు చేపట్టవచ్చని అనుమతి ఇచ్చింది. అయితే ప్రజలకు మాత్రం ఇబ్బంది లేనంత వరకు ఓకే కానీ ప్రజలను ఇబ్బంది పెడితే జోక్యం చేసుకుంటామని అంటున్నారు పోలీసులు.