KTR NEWS: భాగ్యనగరానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తే... నీచ రాజకీయాలతో తనపై కక్ష గట్టి కేసులు నమోదు చేశారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఏసీబీ(ACB) విచారణకు వెళ్లేముందు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చాటేందుకు ఫార్ములా- ఈ రేస్‌ను ఎంతో కష్టపడి హైదరాబాద్(Hyderabad)కు తీసుకొచ్చామన్నారు. భవిష్యత్ మొత్తం ఎలక్ట్రానిక్ వాహన రంగానేదనని గుర్తించి.. ముందుగానే అవకాశాలు ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగించామన్నారు. ‘‘ ఎలక్ట్రానిక్ వాహన రంగంలో భాగ్యనగరాన్ని గమ్యస్థానంగా మార్చడమే ఎజెండాగా ఫార్ములా ఈ రేసు(E-Race) తీసుకొచ్చాం. తెలంగాణలో ఎలక్ట్రానిక్ వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్, తయారీ రంగాల్లో పెట్టబుడులే లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టాం. తద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచించాం. ఫార్ములా ఈ - రేసు నిర్వహణతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగి ఈ- మొబిలిటీ వీక్ ద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. నీచ రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన వారికి ఈ విషయాలు అర్థంకాకపోవచ్చు గానీ... విజ్ఞులైన తెలంగాణ(Telangana) ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసన్నారు. మా విజన్, నిజాన్ని తెలంగాణ సమాజం తప్పకుండా గుర్తిస్తుంది. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది. అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
పార్ములా-ఈ రేసు నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగరపాలక సంస్థ సొమ్ములు చెల్లించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మంత్రివర్గం అనుమతి లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకుని విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు తేల్చారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్(KTR) క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా....తప్పు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ తెలంగాణ హైకోర్టు కేటీఆర్ పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు హాజరుకాగా.. ఏసీబీ అధికారులు న్యాయవాదిని అనుమతించకపోవడంతో... ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోసారి కోర్టును ఆశ్రయించగా విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న న్యాయస్థానం.. ఆయన సమక్షంలోనే విచారించాల్సిందిగా ఆదేశించింది.
కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆయన్ను గృహ నిర్బంధించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్‌ను అరెస్ట్ చేయవచ్చన్న అనుమానంతో బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా హరీష్‌రావును ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధించారు. బీఆర్‌ఎస్ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే...చట్టపరమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే విచారణ సాగుతోందని...ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్‌ను ఆయన సోదరి కవిత(Kavitha) దంపతులు, ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. న్యాయం తప్పకుండా గెలుస్తుందని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.