KTR Comments: తెలంగాణ ప్రజల తీర్పుని బీఆర్ఎస్ ఏ కోణంలో అర్థం చేసుకుంటోంది. ప్రజా తీర్పుని ఆ పార్టీ గౌరవిస్తోందా, లేక ఇంకా ఆ తీర్పు తప్పు అనే అనుకుంటుందా..? నాయకుల మనసులో మాట ఎలా ఉన్నా.. బయటకు వేస్తున్న ట్వీట్లు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. తాజాగా కేటీఆర్ వేసిన ట్వీట్ కూడా వైరల్ గా మారింది. 






 


32 మెడికల్ కాలేజీలు వర్సెస్ 32 యూట్యూబ్ ఛానెళ్లు..
తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికంటే 32 యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని ఎవరూ ఓ కామెంట్ చేశారు. ఆ విశ్లేషణను కేటీఆర్ తన ట్విట్టర్లో పెట్టారు. ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రకరకాల విశ్లేషణలు వింటున్నాయనని, అందులో ఇది కూడా ఒకటి అని ఆయన ఈ ట్వీట్ వేశారు. కొంతవరకు తాను కూడా ఈ వాదనను అంగీకరిస్తున్నట్టు తెలిపారు కేటీఆర్. 


కేటీఆర్ ట్వీట్ కి పాజిటివ్ గా రియాక్షన్లు వచ్చాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ ఈ దిశగా ఆలోచించాలని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో మిగతా పార్టీలకు సపోర్ట్ చేసే ఛానెళ్లు చాలానే ఉన్నాయని, అయితే అవేవీ ఆ పార్టీలకు సంబంధం లేనట్టే ఉంటాయని అంటున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ కి ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్లు లేవని, అందుకే ఇకపై వాటిని కూడా పెట్టుకోవాలని సలహాలిస్తున్నారు. 


యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుంటే విజయం వరిస్తుందా..?
కేటీఆర్ నేరుగా ట్వీట్ చేయకపోయినా.. తన దగ్గరకు వచ్చిన విశ్లేషణల్లో ఇది కూడా ఒకటి అనిమాత్రమే ట్వీట్ వేశారు. అయితే కేటీఆర్ ఆలోచించినట్టుగా.. మీడియా మరీ అంత వన్ సైడ్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసిందా అంటే అనుమానమే. వాస్తవానికి మీడియా అయినా, సోషల్ మీడియా అయినా ఇరు పార్టీలు ఎవరెవరు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడేసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికార పార్టీ కాబట్టి కాస్త ఎక్కువగానే ఆ పార్టీకి మీడియా సపోర్ట్ ఉందనే వాదన కూడా వినపడింది. అయితే ఎన్నికల వేళ.. ప్రజల్ని, సామాన్య ఓటర్లను మీడియా, సోషల్ మీడియా ఎంతవరకు ప్రభావితం చేయగలవు అనేదే అసలు ప్రశ్న. పోనీ కేటీఆర్ చెబుతున్నట్టుగా 32 యూట్యూబ్ ఛానెళ్లు పెట్టి విపరీతంగా ప్రచారం చేస్తే ఫలితం ఎలా ఉండేది..? యూట్యూ ఛానెళ్లు చూసేవారు, సోషల్ మీడియాని నమ్మే అర్బన్ ఓటర్లు అసలు ఎన్నికలకే మొహం చాటేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఓటింగ్ దారుణంగా పడిపోయింది. అంటే యూట్యూబ్ ఛానెళ్లలో ప్రచారం చేసినా కూడా వాటి వల్ల ప్రభావితం అయ్యే అర్బన్ ఓటరు పోలింగ్ బూత్ లకు రాలేదు కాబట్టి ఫలితం ఉండదు. మరి ఇక్కడ కేటీఆర్ లాజిక్ ఎలా కరెక్ట్ అనే వాదన కూడా వినపడుతోంది. 


మొత్తమ్మీద తెలంగాణ ప్రజా తీర్పుని బీఆర్ఎస్ తనదైన శైలిలో విశదీకరిస్తోంది. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ హ్యాట్రిక్ మిస్సైందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఆ ప్రచారాన్ని అడ్డుకుని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదనేది వారి వాదన.