Viveka Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసులో బాధితులైన ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. పులివెందుల పోలీసులు తమపై అక్రమ కేసు పెట్టారని, ఆ కేసును కొట్టేయాలని వారు ఆ పిటిషన్ లో కోరారు. గతంలో వివేకా వద్ద పీఏగా పని చేసిన క్రిష్ణారెడ్డి ఈ కేసు విషయంలో తనను బెదిరిస్తున్నారని సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై 2021 డిసెంబర్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పులివెందులకు చెందిన అగ్ర నాయకుల జోక్యం ఉందని, దానిపై సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరించినట్లుగా క్రిష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ విషయంలో వివేకా కుమార్తె సునీత, రాజశేఖరరెడ్డి కూడా తనపై ఒత్తిడి చేశారని ఆయన ఆరోపణ చేశారు. దీంతో 2023 డిసెంబర్ 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపి.. కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత, రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితమే ఛార్జిషీటు కూడా దాఖలు చేశారు.
తప్పుడు కేసు - సునీత
క్రిష్ణారెడ్డిపై తాము ఎలాంటి ఒత్తిడి చేయలేదని సునీత ఖండించారు. తమను వేధించడానికే తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు. ఫిర్యాదుదారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలం నమోదు చేయకుండానే పులివెందుల కోర్టు.. ఫిర్యాదును పోలీసులకు పంపిందని అన్నారు. కోర్టు యాంత్రికంగా ఉత్తర్వులు జారీచేసిందని.. ఫిర్యాదును పోలీసులకు పంపడం చెల్లదని అన్నారు. తాము నేరానికి పాల్పడ్డామని అనేందుకు ఏరకమైన కారణాలు చెప్పకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదును పంపడం చట్టవిరుద్ధమని సునీత పిటిషన్ లో పేర్కొన్నారు.
వివేకా హత్యకు గురైన సమయంలో ఫిర్యాదుదారు అయిన క్రిష్ణా రెడ్డి అక్కడ ఉన్నారని అన్నారు. సీబీఐ దాఖలు చేసిన ఆఖరి ఛార్జిషీటులో వివేకా హత్య విషయంలో క్రిష్ణారెడ్డి జోక్యం ఉన్నట్లు స్పష్టంగా సందేహం వ్యక్తం చేసిందని అన్నారు. దర్యాప్తు సంస్థ సీబీఐను, మృతుడి కుటుంబ సభ్యులమైన తమను వేధించాలన్న లక్ష్యంతో గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి, తులశమ్మ (ఐదో నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య) స్థానిక కోర్టులలో ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేశారని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు అధికారిపై గతంలో ఓ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం కూడా వివేకా హత్య కేసు విచారణను ఏపీ కోర్టు పరిధి నుంచి.. సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేయడానికి ఓ కారణం అని గుర్తు చేశారు.
2023 జూన్ 30న సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ప్రస్తుత ఫిర్యాదుదారుడు ఎం. క్రిష్ణా రెడ్డిని అనుమానితుడిగా పేర్కొంటూ కారణాలను వెల్లడించిందని కూడా గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో పక్షపాతం లేని విచారణ కోసం ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు ట్రాన్స్ ఫర్ చేశారని, సుప్రీంకోర్టే ఈ ఆదేశాలిచ్చిందని అన్నారు. ఈ విషయాన్ని పులివెందుల కోర్టు పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని అన్నారు.