New Year 2024 Celebrations in Hyderabad: హైదరాబాద్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలు భారీగా జరగనున్నందున ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా ఆంక్షలు విధించారు. ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా పటిష్ఠంగా చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబరు 31 రాత్రివేళ నుంచి ట్రాఫిక్‌ నియంత్రణ, ఇబ్బందుల్లేని ప్రయాణం కోసం జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. తాగి బండి నడపడం.. ఓవర్‌ స్పీడ్‌, బైక్ లపై త్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే భారీ జరిమానాలు విధించడానికి పోలీసులు రెడీ అవుతున్నారు.


రాత్రి 8 నుంచే డ్రంకెన్ డ్రైవ్
హైదరాబాద్ లో రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. నగరంలో ఉన్న 31 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లలో, ఒక్కో స్టేషన్‌ పరిధిలో 3 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, విలాసవంతమైన హోటల్స్ అధికంగా ఉండే జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ లాంటి వెస్ట్ జోన్‌ ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ఒక్కో స్టేషన్ పరిధిలో 5 చెక్‌ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధాన జంక్షన్‌ల వద్ద నార్కోటిక్‌ బ్యూరో పరిధిలో డ్రగ్స్‌ డిటెక్షన్‌ టెస్టులు కూడా నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై అవగాహన కల్పించడానికి పోలీసులు సలార్ లో హీరో ప్రభాస్ చెప్పిన పాపులర్ డైలాగ్స్ ని వాడారు.






రోడ్లు మూసివేత, ఫ్లైఓవర్లు బంద్
కొత్త సంవత్సర వేడుకల వేళ హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉన్న ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్డుపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని నగర హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి శనివారం తెలిపారు. జనవరి 1న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు ఆపేస్తామని తెలిపారు.


హైదరాబాద్ లోని అన్ని ఫ్లైఓవర్లను మూసేయనున్నారు. ఒక్క పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లై ఓవర్‌పై ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు మాత్రం విమానం టికెట్‌ చూపిస్తే అనుమతినిస్తారు. ట్రావెల్స్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్‌, హెవీ ప్యాసింజర్‌ వాహనాలను జనవరి 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు సిటీలోకి అనుమతించరు.