YS Jagan vs Chandrababu: మరో రోజులో 2023 సంవత్సరం ముగిసి కొత్త ఆంగ్ల సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందని ఓసారి వెనక్కు తిరిగి చూసుకొంటే, కోర్టు కేసులు, చంద్రబాబు నాయుడు అరెస్టు, నారా లోకేష్ యువగళం, విశాఖ రాజధాని పేరుతో వైసీపి నేతలు చేసిన ప్రచారం కనిపిస్తుంది. 


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రా రెడ్డి అరెస్ట్ కావడం తెలిసిందే. ఈ కేసులో దోషులు ఎవరనేది తేలలేదు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ కొనసాగుతోంది. వివేకా హత్య కేసులో వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సీబీఐ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగాల్సి వచ్చింది. వైసీపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలతో వైసీపికి ఈ ఏడాది పెద్ద పెద్ద మరకలే అంటుకున్నాయి.


అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 
2023 మార్చిలో విశాఖలో రెండు రోజులపాటు అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. అందులో భాగంగా రాష్ట్రానికి రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, వాటితో సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వైసీపి గొప్పగా చెప్పుకొంది. కానీ వాటిలో పది పరిశ్రమలు కూడా ఏర్పాటు కాలేదని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్వెస్టర్స్ సదస్సు పేరుతో హడావుడి, దాని కోసం చేసిన కోట్ల రూపాయల ఖర్చు అంతా వృద్ధాయే అని.. తమకు జాబ్స్ రాలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఏపీ రాజకీయాల్ని మలుపుతిప్పిన చంద్రబాబు అరెస్ట్.. 
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత అకస్మాత్తుగా టీడీపీ బలపడినట్లు కనిపించింది. సాక్ష్యాలు, ఆధారాలు లేకున్నా అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబుపై ప్రజల్లో సానుభూతి పెరిగినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యాక జనసేనతో కలిసి ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు. వైసీపీ ఆలోచన బెడిసికొట్టగా, తాజాగా ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్చార్జిలని మార్చేస్తున్నారు వైఎస్ జగన్. తమకు టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నా, బయటకు మాత్రం జగన్ ఏం చెబితే అది పాటిస్తామని చెప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. 


విశాఖకు సీఎం జగన్ మకాం మార్చుతారా.. 
సీఎం జగన్ విశాఖకు మకాం మార్చేందుకు స్వయంగా అనేక ముహూర్తాలు పెట్టుకొన్నప్పటికీ ఇంతవరకు రాలేకపోవడంతో వైసీపిపై విమర్శలు వస్తున్నాయి. ఋషికొండపై వందల కోట్లు ఖర్చు చేసిన విలాసవంతమైన భవనం నిర్మించినా.. అది సీఎం కార్యాలయమని చెప్పలేకపోతున్నారు. మరోవైపు కోర్టు తీర్పులు వైసీపీకి అడ్డుకట్టగా మారుతున్నాయి. మరోవైపు 2023 టిడిపికి కాస్త మేలు, కాస్త కీడు చేసిందనే చెప్పవచ్చు. యువగళం పాదయాత్రతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన నాయకత్వ లక్షణాలు చాటుకోగా, జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. 


చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర ప్రజలలో టిడిపి పట్ల సానుభూతి పెరిగింది. ఈ ఏడాదిలోనే టిడిపి, జనసేనల పొత్తు కుదుర్చుకొని నిలకడగా ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్రలతో 2023లో జనసేన పార్టీకి మంచి గుర్తింపే లభించింది. రాష్ట్రంలో బలపడింది కూడా. బీజేపీతో జనసేన పొత్తులో ఉండగానే టిడిపితో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ తీసుకొన్న కీలక నిర్ణయం కూడా ఆ పార్టీని, రాష్ట్ర రాజకీయాలను, పార్టీల బలాబలాలను చాలా ప్రభావితం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి
కనీసం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. అయిదేళ్లు గడిచినా రాజధానిపై స్పష్టత రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కొండల్లా పెరిగిపోతున్నా.. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు తాజాగా పారిశుధ్య కార్మికులు జీతాల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారితే మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశాలున్నాయి.