ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి సమాధి ఏంటో..


దాదాపు 27 ఏళ్ల పాటు సేవలందించిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇటీవలే రిటైర్‌మెంట్ తీసుకుంది. ఈ బ్రౌజర్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నామంటూ మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. 90ల్లోని వారంతా ఈ వార్త వినగానే ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. గుడ్‌ బై, మిస్‌ యూ అంటూ సోషల్ మీడియాలో  పోస్ట్‌లు పెట్టారు. అయితే ఓ కొరియన్‌ ఇంజనీర్ మాత్రం అంతకు మించి ఇంకేదో చేయాలనుకున్నాడు. తనదైన స్టైల్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి వీడ్కోలు పలికాడు.


300డాలర్లు ఖర్చు పెట్టాడట..


దక్షిణ కొరియాకు చెందిన జంగ్‌ కి యంగ్ అనే వ్యక్తి దాదాపు 300డాలర్లు ఖర్చు పెట్టి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి సమాధి కట్టించాడు. కట్టాడంటే 
కట్టాడులే అన్నట్టుగా కాకుండా చాలా పటిష్ఠంగా ఉండేలా చూసుకున్నాడు. దానిపైనే ఏం రాశాడో తెలిస్తే నవ్వు ఆపుకోలేం. "వేరే బ్రౌజర్లను డౌన్‌లోడ్ చేసుకోటానికి, ఇదో మంచి టూల్" అని అంటూ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కి చురకలు వేస్తూనే, సెండాఫ్ ఇచ్చాడు. నిజానికి ఇలా రాయటంలో వింతేమీ లేదు. ఈ బ్రౌజర్‌తో విసిగిపోయిన నెటిజన్లు, వేరే బ్రౌజర్లు డౌన్‌లోడ్ చేసుకోటానికి మాత్రమే ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ని వినియోగించేవారు. గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్‌ని డౌన్‌లోడ్ చేసేవాళ్లు. విండోస్‌తో  పాటు డిఫాల్ట్‌గా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వస్తున్నా... వినియోగదారులు అసలు ఈ బ్రౌజర్‌ను పట్టించుకోవటమే మానేశారు. 


ఇదో సెటైరికల్ సెండాఫ్..


కొరియన్ ఇంజనీర్ కట్టించిన సమాధి దక్షిణ కొరియాలోని గ్యోంజు నగరంలో ఉంది. ఇంటర్నెట్‌లో ఫోటో పెట్టాక ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ గురించి మీరేమంటారని ఆ ఇంజనీర్‌ని అడిగితే "కచ్చితంగా నా ఫీలింగ్ ఇది అని చెప్పలేకపోతున్నాను. ఈ బ్రౌజర్‌తో చాలా  ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అయినా, ఎందుకో ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడిపోయింది" అని చెబుతున్నాడు. ఇక్కడికి వచ్చి ఈ సమాధిని చూసి అందరూ నవ్వుకోవాలని అనుకున్నానని, కానీ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరల్ అవటం ఆశ్చర్యం కలిగించిందని అంటున్నాడు. 


సెక్యూరిటీ లేకపోవటమే అతి పెద్ద డ్రాబ్యాక్ 


ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వాడే యూజర్స్ ఇకపై ఆటోమెటిక్‌గా ఎడ్జ్‌కి రీడైరెక్ట్ అయిపోతారు. అయితే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో సేవ్ చేసుకున్న డేటాని పొందాలంటే IE Modeని ఎనేబుల్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. యూజర్స్‌కి బెటర్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అప్‌డేట్‌లు రాకపోవటం ఈ బ్రౌజర్‌కి మేజర్ డ్రాబ్యాక్. ఉన్న వర్షన్‌ కూడా క్రమక్రమంగా హ్యాంగ్ అయిపోవటం, బ్రౌజింగ్ చాలా స్లో అవటం లాంటి సమస్యలు యూజర్స్‌ని అసహనానికి గురి చేశాయి. సెక్యూరిటీ లేకపోవటం మరో డ్రాబ్యాక్. హ్యాకర్లు చాలా సులువుగా యూజర్స్ డేటాని హ్యాక్ చేయగలిగారు. ఈ విషయంలో భద్రత లేకపోవటం వల్ల యూజర్స్‌ వేరే బ్రౌజర్‌లకు మళ్లారు.