Agnipath Protest Updates: రాకేష్ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి
అగ్నిపథ్ నిరసనలో భాగంగా జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. శనివారం ఎంజీఎంకు వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి.. యువకుడు రాకేష్ మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు.
అనంతరం ఎంజీఎం నుండి ఖానాపూర్ మండలం డబ్బీర్ పేట వరకు జరిగిన రాకేష్ అంతిమ యాత్రలో కాలినడకన పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, రాకేష్ పాడే మోశారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించారు.
భావోద్వేగాలతో గెలవాలనుకుంటున్న మోదీ ప్రభుత్వం
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న వారి భావోద్వేగాలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆడుకుంటోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతుల విషయంలో రాజకీయాలు చేసి క్షమాపణ చెప్పినట్లుగానే ప్రధాని మోదీ అగ్నిపథ్ విధానంపై సైతం క్షమాపణ చెప్పి- పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ విధానం అదో అమోమయ విధానంలాగ ఉందని, దీని ద్వారా యువత ప్రాణాలను కేంద్రం బలిగొంటుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అగ్నిపథ్ పథకం ద్వారా దేశరక్షణతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని, ఇది దేశ ప్రజలకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ ఆందోళనల్లో పాల్గొన్న వరంగ్ యువకుడు రాకేష్ చనిపోవడం బాధాకరమన్నారు. రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అయితే సైన్యంలో ఔట్‌సోర్సింగ్ విధానం తీసుకురావడం కచ్చితంగా దారుణమైన నిర్ణయమన్నారు. సైనికుల ప్రాణాలను బలితీసుకుని, భావోద్వేగాలతో గెలవాలని మోదీ చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం, మోదీ నిర్ణయాలతో దేశం ఇప్పటికే నాశనమైపోయిందన్నారు. అన్ని సంస్థలను కేంద్రం చేతిలో పెడుతోన్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు సైనికులు, ఆర్మీ విషయంలోనూ రాజకీయాలు చేయడం తగదని సూచించారు. మోదీ ప్రభుత్వం వివాదాస్పద అగ్నిపథ్ స్కీమ్ రద్దు చేసేవరకు టీఆర్ఎస్ నేతలు పోరాటం కొనసాగిస్తారని, రాష్ట్ర యువతకు అండగా ఉంటామన్నారు.
Also Read: CM KCR On Rakesh Death: రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం: సీఎం కేసీఆర్
Also Read: TS Govt Jobs : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్