Kerala Man Traffic Pics: 



సేఫ్‌టీ కెమెరాలతో కాపురంలో చిచ్చు 


కేరళలో రోడ్‌ సేఫ్‌టీ కెమెరాలు పెట్టడం ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఇవి అవసరమా..? అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికే కాదు. ఓ వ్యక్తికీ ఈ కెమెరాలు పెద్ద కష్టం తెచ్చి పెట్టాయి. ఓ మహిళతో బైక్‌పై చక్కర్లు కొట్టాడు. కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోకుండా షికార్లు చేశాడు. రోడ్‌ సేఫ్‌టీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది. ఇందులో తలనొప్పి ఏముంది..? ఇద్దరూ కలిసి తిరిగితే తప్పేముంది అంటారేమో. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లైంది. భార్యతో కాకుండా వేరే మహిళతో బైక్‌పై చక్కర్లు కొట్టాడు. వెనకాల అమ్మాయి ఉండే సరికి మనోడు రూల్స్ అన్నీ పక్కన పెట్టాడు. మరి రూల్స్ ఫాలో అవ్వకపోతే పోలీసులు ఊరుకుంటారా..? సేఫ్‌టీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోల నుంచి హై రిజల్యూషన్‌ ఫోటోలు క్యాప్చర్ చేసి మరీ నోటీసులు పంపించారు. ఈ దెబ్బతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. వేరే మహిళతో బైక్‌పై తిరగడంపై భార్య నిలదీసింది. ఈ గొడవ కాస్తా ముదిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. 


భార్య పేరుతో రిజిస్ట్రేషన్ 


ఇడుక్కికి చెందిన ఓ వ్యక్తి ఏప్రిల్ 25వ తేదీన హెల్మెట్ లేకుండా ఓ మహిళతో స్కూటర్‌పై తిరిగాడు. వెహికిల్ రిజిస్ట్రేషన్‌ భార్యపేరుపైనే ఉంది. ట్రాఫిక్ ఉల్లంఘించినట్టుగా ఆమెకే నేరుగా మెసేజ్‌లు వెళ్లాయి. ఫైన్ కట్టాలని చలానాలు పంపారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ఫోటోలు చూసిన వెంటనే ఆ మహిళ భర్తను ప్రశ్నించింది. బైక్‌పై వెనకాల ఎవరు అని నిలదీసింది. ఓ బట్టల షాప్‌లో పని చేసే ఆ వ్యక్తి ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. లిఫ్ట్ ఇవ్వమంటే ఇచ్చానని బుకాయించాడు. భార్య ఇదంతా కట్టుకథ అని వాదించింది. ఇలా ఇద్దరూ గొడవ పడ్డారు. ఇలా కాదని...వెంటనే పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చింది. తనపై చేయి చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసుల అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు అతనికి రిమాండ్ ఇచ్చింది. నిజానికి..ఈ సేఫ్‌టీ కెమెరాలపై కేరళలో చాలా రోజులుగా గొడవ జరుగుతోంది. "Safe Kerala" ప్రాజెక్ట్‌లో భాగంగా వీటిని ఇన్‌స్టాల్ చేసింది ప్రభుత్వం. కానీ..ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం అవినీతి ఆరోపణలు చేస్తోంది. కెమెరాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.