Sena Vs Sena Row:
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిందేకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. షిందే వర్గానికి చెందిన వ్యక్తిని విప్‌గా నియమించడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. శివసేన సంక్షోభాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. గోగావాలేను విప్‌గా నియమించడం సరికాదని వెల్లడించింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదని తేల్చడంలో గవర్నర్ తొందరపడ్డారని తేల్చి చెప్పింది. థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని, తిరిగి ఆయనను సీఎం చేయడం కుదరదని సీజేఐ చంద్రచూడ్ తేల్చి చెప్పారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. శివసేన పార్టీ చీఫ్ విప్‌గా గోగావాలేను స్పీకర్ నియమించడం సరికాదని తెలిపింది. అయితే...ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది. ఈ అంశంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని వెల్లడించింది. ఉద్దవ్ థాక్రే బలపరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేశారని, మళ్లీ థాక్రేనే సీఎంగా చేయడం కుదరదని వివరించింది. పార్టీ విప్‌గా ఎవరుండాలన్నది ఏకపక్షంగా నిర్ణయం తీసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రెండు పార్టీలూ ఎవరికి వాళ్లు చీఫ్ విప్‌లను నియమించుకున్నాయని, దీనిపై స్వతంత్ర విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది. రాజ్యాంగంలో లేని అధికారాలను గవర్నర్ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే గవర్నర్ బాధ్యతలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. రాజకీయ పార్టీల విభేదాల్లో గవర్నర్ తలదూర్చకూడదని తెలిపింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారంలోకి వచ్చిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని అన్నారు.
"షిందే వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీ చీఫ్ విప్‌గా నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది"
- సంజయ్ రౌత్, శివసేన (థాక్రే) నేత
అయితే...అటు శిందే వర్గం కూడా సుప్రీంకోర్టు తీర్పుపై సానుకూలంగానే స్పందించింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తమకు ఎంతో ఊరటనిచ్చాయని అంటోంది. త్వరలోనే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్పష్టం చేస్తోంది. ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసే విషయంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంపైనా శిందే వర్గం కాస్త ఊపిరి పీల్చుకుంది.