తొలి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుదీప్తోసేన్ దర్శకత్వంలో ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలంటూ కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పలు పార్టీల నాయకులు ఆందోళన బాటపడ్డారు. పలు చోట్ల ఇప్పటికీ పోలీసు బందోబస్తు నడుమ సినిమాను ప్రదర్శిస్తున్నారు. కేరళలో పలు సినిమా థియేటర్ల ముందు అధికార, ప్రతిపక్ష నేతలు నిరసనలు చేపడుతూనే ఉన్నారు. సినిమా ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
సంఖ్య ముఖ్యం కాదు, ఉగ్రవాదం వైపు వెళ్తున్నారా? లేదా? అనేది ముఖ్యం- విపుల్ షా
'ది కేరళ స్టోరీ' సినిమా కథ ఇస్లాం మతంలోకి మారిన మహిళల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ లో కేరళకు చెందిన 32,000 మందికి పైగా మహిళలు ఐసిస్ లో చేరినట్లు చూపించారు మేకర్స్. ఆ తర్వాత ఈ సంఖ్యను మూడుకి మార్చారు. ఈ మార్పుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని గణాంకాలపై నిర్మాత విపుల్ షా స్పందించారు. “'ది కేరళ స్టోరీ' సినిమా ద్వారా కేరళలో జరుగుతున్న ఉగ్ర వ్యాప్తి గురించి తెలియజేయాలి అనుకున్నాం. ఇప్పటికే కేరళ నుంచి పలువురు యువతులు ఐసిస్ లో చేరారు. వారిలో కొందరు మతం మారిన యువతులు ఉన్నారు. సినిమాలో చూపించిన యువతుల సంఖ్యను చాలా మంది వివాదం చేస్తున్నారు. 32 వేలా? 32 మందా? అనేది అసలు విషయం అదికాదు. అక్కడి యువతులు ఉగ్రవాదం వైపు తరలించబడుతున్నారా? లేదా? అనేది ముఖ్యం. ఈ సినిమా ద్వారా మేము ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకున్నాం. తీసుకెళ్లాం కూడా” అని వివరించారు.
‘ది కేరళ స్టోరీ’కథ ఏంటంటే?
కేరళలో గత కొద్ది సంవత్సరాలుగా 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ వారు ఏమయ్యారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు సుదీప్తోసేన్. కేరళకు చెందిన నలుగురు యువతులు బలవంతంగా మతం మారి, ఆ తర్వాత వాళ్లు ఐసిస్ లో చేరడం ఈ సినిమాలో చూపిస్తారు. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read : విజయ్ దేవరకొండ సినిమా పోస్టర్ కాపీనా? ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్
ప్రధాని ప్రశంసలు, మమతా నిషేధం
తాజాగా కర్నాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ‘ది కేరళ స్టోరీ’ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు. ఉగ్రవాదం, దాని ఆకృత్యాలను ఈ సినిమాలో దర్శకుడు బయటపెట్టారని ఆయన ప్రశంసించారు. అయితే, పశ్చిమ బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ మాత్రం తమ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించింది. మరోవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లను రాబడుతోంది.
Read Also: చేతకాని వాళ్ళు అదుపు తప్పారు, తిడితే వాళ్ళ నోరే కంపు అవుతుంది - అనసూయ ఫైర్