విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గూఢచారిగా కనిపించనున్నారు. 'మళ్ళీ రావా', 'జెర్సీ' చిత్రాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో రౌడీ బాయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో హీరోది స్పై రోల్. హీరో బర్త్ డే సందర్భంగా నిన్న ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేయడానికి కారణమైంది.
హాలీవుడ్ 'అర్గో'కి కాపీనా?
'అర్గో' అని 2012లో ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది. అందులో హీరో కూడా స్పై. తన సమాచారం రహస్యంగా ఉండాలని, ఎవరికీ తెలియకూడదని పేపర్లను మెషిన్ ద్వారా స్క్రాప్ చేస్తాడు. ఆ థీమ్ ప్రేక్షకులకు చెప్పేలా ఆ సినిమా పోస్టర్స్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా పోస్టర్ చూస్తే... కొందరికి 'అర్గో' పోస్టర్ గుర్తుకు వచ్చింది. పైగా, రెండు సినిమాల్లో హీరో స్పై కావడంతో ఆ సినిమాకు కాపీనా? అంటూ కామెంట్స్ మొదలు అయ్యాయి.
విజయ్ దేవరకొండ పోస్టర్ మీద విమర్శలు రావడంతో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రెస్పాండ్ అయ్యారు. ఆ పోస్టర్ తరహాలో ఉన్న మరో మూడు పోస్టర్లను ఆయన ట్వీట్ చేశారు.
''ఓ అభిప్రాయానికి వచ్చే ముందు, కాంటెక్స్ట్ ఏంటి? అనేది అర్థం చేసుకోవడం మంచిది. సీక్రెట్ ఏజెంట్స్ (గూఢచారులు) తమ ఐడెంటిటీ మాయం చేయడం అనే కాన్సెప్ట్ చాలా పాతది. దయచేసి ఎటువంటి ఆధారాలు లేకుండా తీర్పులు ఇవ్వవద్దు'' అని నాగవంశీ తెలిపారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ చిత్రాన్ని (VD 12 Movie) నిర్మిస్తున్నారు.
Also Read : ప్రేమలో ప్రభాస్ - అనుష్క తప్ప ఎవరూ సెట్ అవ్వరా? 'ఆదిపురుష్' ట్రైలర్ మీమ్స్ చూశారా
''నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి... నేను ఎవరికి చెందిన వాడినో తెలియదు - ఓ అజ్ఞాత గూఢచారి'' అని పోస్టర్ మీద రాసి ఉంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ కోట్ పేర్కొన్నారు. ఈ రోజు స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా ''ప్రతి గూఢచారి కథ ముగియడం వెనుక ఓ గూడుపుఠాణి ఉంటుంది. అయితే, వారి వెనుక ఉన్న నిజం ఎప్పటికీ బయటకు రాదు'' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తి కలిగించాయి.
Also Read : బన్నీతో ఫోటో మాత్రమే, 'పుష్ప 2'లో సీరత్ ఐటమ్ లేదు!
గూఢచారిగా విజయ్ దేవరకొండ కథ ఏమిటి? ఆయన వెనుక ఉన్న నిజం ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే... సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కలయికలో తొలి చిత్రమిది. అలాగే, విజయ్ దేవరకొండ & హీరోయిన్ శ్రీ లీల కలయికలో కూడా తొలి చిత్రమిది. 'జెర్సీ'కి సంగీతం అందించిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మరోసారి గౌతమ్ తిన్ననూరి, సితార సంస్థతో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు : నవీన్ నూలి, ఛాయాగ్రహణం : గిరీష్ గంగాధరన్, కళా దర్శకత్వం : అవినాష్ కొల్లా.