గురువాయూర్.. కేరళ త్రిస్సూర్‌లో కొలువైన శ్రీకృష్ణుడి ఆలయం. ఇక్కడ గురువాయురప్పగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు కృష్ణుడు. దేశంలోని ప్రముఖ దైవ క్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి దర్శనానికి వస్తారు. కొవిడ్ సమయంలో కూడా నిబంధనలను పాటిస్తూ భక్తులు వస్తున్నారు. ఇక్కడ హుండీలో కానుకలు కూడా అదే రీతిలో వస్తాయి. ఇక్కడ హుండీలు ఎప్పుడు కానుకలతో కళకళలాడుతుంటాయి. అయితే తాజాగా ఇక్కడ ఓ చిక్కు వచ్చి పడింది. అదేంటంటే..? 


భక్తులు హుండీలో వేసిన నోట్లలో చాలా వరకు రద్దు అయిన పాత కరెన్సీ ఉండటంతో ఆలయ నిర్వాహకులు షాక్ అవుతున్నారు. ఈ నోట్లను ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. గత శనివారం ఒక్క రోజే 36 రూ.1000 నోట్లు, 57 రూ.500 నోట్లు హుండీలో లభించాయి. 


ఐదేళ్లలో ఈ మొత్తం విలువ రూ. 1.35 కోట్లుగా ఉంది. వీటికి ఎలాంటి విలువ లేదని తెలిసి నోట్లను భక్తులు హుండీల్లో వేసేస్తున్నారని అధికారులు అంటున్నారు.


మరోవైపు డిసెంబర్​లో ఆలయ హుండీల లెక్కింపు ప్రక్రియను ఇటీవలే నిర్వహించారు. రూ. 5.5 కోట్ల నగదు, 4.13 కేజీల బంగారం, 11.2కేజీల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించుకున్నట్లు అధికారులు తెలిపారు.


డీమానిటైజేషన్.. 


2016, నవంబర్​ 8న రూ.500, రూ.1000 పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కష్టాలను ఎదుర్కొన్నారు. దొంగ నోట్ల చలామణి, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రజలు మాత్రం చాలా కాలంపాటు అవస్థలుపడ్డారు. 


అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోని ప్రజలంతా డిజిటల్ లావాదేవీలకు పెద్ద మొత్తంలో శ్రీకారం చుట్టారు. ప్రజలను ఆ దిశగా అడుగులు వేయించేందుకు ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలే చేసింది. రీటైలర్స్ కూడా ప్రజలను ఆకర్షిచేందుకు వినూత్న ఆఫర్లు, డిసౌంట్లు ప్రకటించాయి. డిజిటల్ పేమెంట్  అప్లికేషన్లు చాలా పుట్టుకువచ్చాయి. బ్యాంకులు, వివిధ కంపెనీల అనుసంధానంతో ఈ డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు పనిచేయడం మొదలుపెట్టాయి.


అంతేకాదు ప్రజలను ఆకర్షించేందుకు ఆన్ లైన్ బ్యాంకింగ్ ఛార్జీలను కూడా బ్యాంకులు తగ్గించాయి. తర్వాత మళ్లీ పెంచినప్పటికీ డీమానిటైజేషన్ ముందుకన్నా తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, మున్సిపల్ బోర్డులు, పవర్ డిపార్ట్ మెంట్స్ లాంటి సంస్థలు డిజిటల్ విధానంలోనే బిల్లులు చెల్లింపులను స్వీకరిస్తున్నాయి.




Also Read: India's Omicron Cases: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి