Telugu News: కేరళలోని కొజికోడ్ మెడికల్ కాలేజ్‌లో ఓ డాక్టర్‌ వేలికి సర్జరీ చేయబోయి నాలుకకి సర్జరీ చేశాడు. ఓ చిన్నారి చేతికి ఉన్న ఆరో వేలుని తొలగించాల్సింది పోయి నాలుకకు సర్జరీ చేయడం సంచలనమైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వెంటనే ఆ వైద్యుడిని సస్పెండ్ చేశారు. సర్జరీ అయిపోయిన తరవాత బయటకు వచ్చిన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇదేంటని వైద్యుడిని నిలదీశారు. నోట్లో సిస్ట్ ఉందని, తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ సమాధానం విన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అలాంటి సమస్యే లేదని,తన నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఏదేదో చెబుతున్నారంటూ మండి పడ్డారు. అధికారులకు కంప్లెయింట్ ఇచ్చారు. ఈ ఘటనపై విచారించిన అధికారులు చివరకు తమదే తప్పు అని అంగీకరించారు. ఇద్దరు చిన్నారులకు ఒకే రోజు సర్జరీ చేయాల్సి ఉందని, ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి చేశారని వివరించారు. 


ఈ ఘటన స్థానికంగానే కాక రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ వెంటనే స్పందించారు. సర్జరీ చేసిన వైద్యుడిని సస్పెండ్ చేశారు. ఆ తరవాత రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్‌కి మెడికల్ ప్రొసీజర్ ప్రోటోకాల్స్ జారీ చేసింది ఆరోగ్య శాఖ. సర్జరీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డాక్టర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. అటు రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపింది. హాస్పిటల్స్‌లో సరైన వైద్య వసతులు ఉండడం లేదంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. రాష్ట్ర వైద్య రంగానికే మచ్చ తెస్తున్నారంటూ మండి పడుతున్నాయి.