Kapico Resort in Alappuzha: 


సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు..


సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు పరుస్తూ...కేరళలోని అలెప్పీలో అక్రమంగా నిర్మించిన కాపికో రిసార్ట్‌ను కలెక్టర్ వీఆర్ కృష్ణ తేజ సమక్షంలో కూల్చివేశారు. ఈ రిసార్ట్‌ను కూల్చాలంటూ సుప్రీం కోర్టు ఎప్పుడో చెప్పింది. ఈ ఆదేశాలను ఈ నెల 15వ తేదీన అమలు చేశారు. తీర ప్రాంత రక్షణ నిబంధనలు (Coastal Regulation Zone)ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020లోనే సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ...కొవిడ్ సంక్షోభం వల్ల అప్పట్లో ఇది సాధ్య పడలేదు. 2007లో మొదలైన ఈ రిసార్ట్ నిర్మాణం...2012లో పూర్తైంది. ఈ రిసార్ట్‌ కూల్చివేతకు అవుతున్న ఖర్చుని యజమానులే భరిస్తున్నారు. ఇదే విషయాన్ని అలెప్పీ జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణతేజ వెల్లడించారు. "రిసార్ట్ యజమానులే ఈ ఖర్చు భరిస్తున్నారు. రికార్డుల ప్రకారం ఈ రిసార్ట్ నిర్మాణం కోసం 2.9 హెక్టార్ల భూమిని ఆక్రమించారు. వారం రోజుల క్రితం ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులోని మొత్తం 54 విల్లాలను కూల్చివేస్తాం. ప్రజాధనం ఇందుకోసం వినియో గించటం లేదు" అని స్పష్టం చేశారు కృష్ణ తేజ. 










రూ.200 కోట్ల విలువైన రిసార్ట్..


వెంబనాడ్‌ సరస్సులోని చిన్న ద్వీపంలో ఈ అల్ట్రా లగ్జరీ సెవెన్ స్టార్ రిసార్ట్ ఉంది. దీని విలువ రూ.200 కోట్లు. అయితే..ఈ నిర్మాణం చేపట్టక ముందే ప్రభుత్వాధికారులు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులకు, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదని స్పష్టం చేసింది. కానీ...ఈ నిబంధనలను, సూచనలు పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టారు. స్థానిక మత్య్సకారుల జీవనోపాధిపై ప్రభావం పడినట్టు సమాచారం. కొందరు యువకులు కోర్టుల చుట్టూ తిరిగారు. చివరకు స్థానికులకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రిసార్ట్ కూల్చివేతకు ఎలాంటి బాంబులు వినియోగించటం లేదు. దాదాపు 36,000 చదరపు అడుగుల మేర శిథిలాలు చెల్లాచెదురుగా పడుతుండొచ్చని అంచనా. పానవల్లి విలేజ్ పంచాయతీ పరిధిలో ఉంది ఈ భూమి. ముత్తూట్, కువైట్‌కు చెందిన కాపికో గ్రూప్‌ ఈ రిసార్ట్‌ను నిర్వహిస్తోంది. 


Also Read: Anantapur News: తల్లిదండ్రులు మరణించారు.. పిల్లలు శిక్ష విధించుకున్నారు