Anantapur News: ఎంతో అపురూపంగా పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్డుపాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. పట్టెడన్నం పెట్టకుండా అమ్మానాన్నలను నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమాలలో ఉంచుతున్న పిల్లలు కోకొల్లలుగా ఉన్న కాలమిది. అయితే అందుకు భిన్నంగా తల్లిదండ్రులు దూరమయ్యారన్న బాధతో జీవితాన్ని అంధకారం చేసుకున్న బిడ్డల వ్యవహారం అనంతపురం పట్టణంలో కలకలం రేపుతోంది.
వారికే వారే విధించుకున్న శిక్ష
మూడు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు సంతానం నరకయాతనను శిక్షగా స్వీకరించారు. కనీసం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా 3 సంవత్సరాలు మగ్గిపోయారు. ఇంటినీ, ఒంటినీ శుభ్రం చేసుకోకుండా వారికి వారే శిక్ష విధించుకున్నారు. తల్లిదండ్రులు లేని ఈ లోకం నరకప్రాయం అనుకున్నారేమో గాని వారికి వారే శిక్ష వేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మూడేళ్లుగా చీకట్లోనే
అనంతపురం నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వేణుగోపాల్ నగర్‌లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు 3 ఏళ్లుగా బయటి ప్రపంచాన్ని చూడలేదు. ఇంటికి వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం గంట పాటు బయటకు వచ్చి ఆ సమయంలోనే వారికి అవసరమైన అన్న పానీయాలు తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అంతే ఇక లోపల ఏం జరుగుతుందో, ఎవరున్నారో, అసలు అక్కడ జనం ఉన్నారా లేదా అని కూడా అంతు పట్టని విధంగా ఉంటుంది. దాదాపు 3 సంవత్సరాలపైగా ఇలాంటి దుర్భర జీవితాన్ని గడిపారు ముగ్గురు. వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఇద్దరు అక్కచెళ్లెల్లు, ఒక సోదరుడు.. మూడు సంవత్సరాలుగా అంధకార జీవితాన్ని గడిపారు. చివరకు ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో అసలు గుట్టు బయటపడింది. తమను కన్న తల్లిదండ్రులు దూరమయ్యారని ఇద్దరు అక్కచెల్లెళ్లు, అన్న కుంగిపోయి దుర్భర జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యారు.
తల్లిదండ్రులే లేనప్పుడు ప్రపంచం ఎందుకు
అనంతపురం నగరానికి చెందిన వేణుగోపాల్ నగర్‌లో నివాసం ఉంటున్న అంబటి తిరుపాల్‌శెట్టికి అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వారి కుటుంబం ఒకప్పుడు బాగానే ఉంది. హోటల్ పెట్టుకొని జీవనం చేస్తుండేవారు. వీరి తల్లిదండ్రులు చనిపోవటంతో వారందరూ మనోవేదనకు గురయ్యారు. వారి తండ్రి 2016లో, తల్లి 2017లో ఆరోగ్యం బాగాలేక మరణించారు. వారింటిలో జరిగిన విషాదం ఆ కుటుంబాన్ని పెద్ద అగాథంలో ముంచింది. తల్లిదండ్రులు లేని జీవితం మాకెందుకు అనుకున్నారేమోగానీ బాహ్య ప్రపంచాన్ని చూడవద్దని వారు నిర్ణయించుకున్నారు. ముగ్గురూ ఇంటికే పరిమితమయ్యారు. క్రమక్రమంగా వారి జీవితం అంధకారమయంగా మారిపోయింది. ఇల్లంతా బూజు పట్టింది. బయట నుంచి లోపలికి వెళ్లేవారి కానీ, లోపల నుంచి బయటికి వచ్చేవారు గానీ లేరు. దీంతో వారి దీనస్థితి బయటకు రాలేదు. ఇంటిలో ఉన్న ఒక్కడే కొద్దిసేపు బయటికి వచ్చి అవసరమైన వాటిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయేవాడు. అదీ ఒక గంట సమయంలో.
స్థానికుల చొరవతో బయటకు
ఇంటి నిండా చెత్తాచెదారం పేరుకుపోయింది. హోటల్ నుంచి తెచ్చుకున్న ఆహారం పదార్థాల వ్యర్థాలు గుట్టలుగా నిండి ఉన్నాయి. స్నానం చేస్తున్నారో లేదో తెలియదు కానీ.. వారి నుంచి దుర్వాసన వస్తోంది. బట్టలు మాసిపోయాయి. ఇల్లంతా చీకటే. ఇంటి నుంచి వస్తున్న దుర్వాసనను గుర్తించిన స్థానికులు ఆరా తీసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారి విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఇంట్లోకి వెళ్లి ఆ ముగ్గురినీ బయటకు తీసుకువచ్చారు.