Karnataka Land Scam Case: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ల్యాండ్‌ స్కామ్‌ కేసులో ఆయన ఇరుక్కునే అవకాశాలున్నాయి. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA)కి స్థల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సిద్ద రామయ్య. కర్ణాటక గవర్నర్ తావర్‌చంద్ గహ్లోట్‌ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ముగ్గురు సోషల్ యాక్టివిస్ట్‌లు వేసిన పిటిషన్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి నోటీసులు అందాయి. ఇదే విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఈ కేసుని రాజకీయ కుట్రగా చెబుతున్నారు సిద్దరామయ్య. గత నెలలోనే ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు గవర్నర్. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఎందుకు చర్యలు తీసుకోకూడదో కూడా వివరించాలని స్పష్టం చేశారు. దీనిపై సిద్దరామయ్య సర్కార్ భగ్గుమంది. వెంటనే ఆ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండి పడింది. రూ. కోట్ల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. జులైలో లోకాయుక్త పోలీసులకు ఇదే విషయమై ఫిర్యాదు చేశారు. సిద్దరామయ్య సతీమణి పార్వతి పేరుపైన 14 స్థలాల్ని కేటాయించినట్టు ఆరోపించారు. ఈ కారణంగా రూ.45 కోట్ల స్కామ్ జరిగినట్టు చెబుతున్నారు. (Also Read: Rajasthan: మత ఘర్షణలతో రగులుతున్న రాజస్థాన్! ఇంటర్నెట్ సేవలు బంద్ - పలు చోట్ల 144 సెక్షన్)






సిద్దరామయ్యతో పాటు ఆయన సతీమణి పార్వతి, కొడుకు యతీంద్ర, MUDAలోని సీనియర్ అధికారుల పేర్లనూ ఈ ఫిర్యాదులో చేర్చారు. కేసరే గ్రామంలో MUDA సిద్దరామయ్య సతీమణి పార్వతికి చెందిన భూమిని సేకరించింది. అందుకు బదులుగా ఆమెకి మైసూరులో ఓ ప్లాట్‌ని కేటాయించింది. అయితే...ఈ ప్లాట్‌ విలువ చాలా ఎక్కువ అని, కావాలనే ఆమెకి ప్రయోజనం కలిగించేలా అధికారులు వ్యవహరించారని ఆరోపిస్తున్నారు పిటిషనర్లు. సిద్దరామయ్య భార్యకి ఆ స్థలం గిఫ్ట్‌గా వచ్చిందని వాదిస్తున్నా...పిటిషనర్లు మాత్రం ఆ స్థలాన్ని ఆక్రమించారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుపై కొత్త FIR నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ వివాదంపై డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ఈ రాజకీయ దాడిని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సిద్దరామయ్యకి అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు. లీగల్‌గా ఏం చేయొచ్చో ఇప్పటికే ఓ నిర్ణయించుకున్నామని అన్నారు. వెనకబడిన వర్గానికి చెందిన నేతపై ఇలా రాజకీయంగా కక్ష సాధిస్తున్నారని మండి పడ్డారు. 


Also Read: Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్, కోల్‌కత్తా ఘటనపై లక్షలాది మంది డాక్టర్ల నిరసన