Kolkata Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవల్ని నిలిపివేసింది. ఈ ఉదయం ఆందోళనలు ప్రారంభించింది. పలు రాష్ట్రాల్లోని హాస్పిటల్స్‌లో వైద్యులు విధులు బహిష్కరించి నిరనసలు తెలిపారు. న్యాయం జరగాల్సిందేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వైద్యులు ఈ నిరసనలో పాల్గొంటున్నారని అంచనా. కేవలం ఎమర్జెన్సీ కేసులను తప్ప మిగతా సేవలన్నీ నిలిపివేశారు. ఇవాళ (ఆగస్టు 17) ఉదయం 6 గంటలకు  ఈ స్ట్రైక్ మొదలు పెట్టారు. అత్యవసర సర్జరీలు మాత్రమే చేస్తున్నట్టు IMA ప్రకటించింది. ఇదే సమయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్ని డిమాండ్‌లనీ వినిపించింది. మెడికల్ స్టాఫ్‌కి భద్రత కల్పించేలా చట్టాల్ని మరింత పటిష్ఠం చేయాలని తేల్చి చెప్పింది. వీళ్లపై ఈ స్థాయిలో హింస జరుగుతున్నా పట్టించుకోడం లేదని మండి పడింది. హాస్పిటల్స్ వద్ద భద్రత పెంచాలని డిమాండ్ చేసింది. కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసుని పారదర్శకంగా విచారించాలని కోరింది. అంతే కాదు. హాస్పిటల్‌పై దాడి చేసిన వాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బాధితురాలి కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. 






సీబీఐ విచారణ..


ప్రస్తుతం ఈ కేసు CBI పరిధిలో ఉంది. ఇప్పటికే విచారణ మొదలు పెట్టిన అధికారులు త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని చెబుతున్నారు. కోల్‌కత్తాలోని ఆర్‌జీ కార్‌ హాస్పిటల్‌లోని సెమినార్‌ రూమ్‌లో ట్రైనీ డాక్టర్‌ శవం అర్ధనగ్నంగా కనిపించింది. షాకైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వాళ్లు హాస్పిటల్‌కి వచ్చాక దాదాపు మూడు గంటల పాటు కూర్చోబెట్టి అప్పుడు కూతురి డెడ్‌బాడీని చూపించారు. ఈ దారుణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా వైద్యులు భగ్గుమంటున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ పారదర్శకంగా జరగడం లేదన్న విమర్శలతో హైకోర్టు ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ హాస్పిటల్‌ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా ఎంపీలతో కలిసి ఆందోళన చేపట్టారు. సీబీఐ వేగంగా విచారించి ఓ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని డిమాండ్ చేశారు మమతా బెనర్జీ. 






Also Read: Viral News: భార్య హింసిస్తోంది, జైలుకైనా వెళ్తా కానీ ఇంటికి మాత్రం పోను - ఓ టెకీ ఆవేదన