Chandra Babu Delhi Tour: ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ కేంద్రం పెద్దలతో సమావేశంకానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రధానమంత్రి మోదీ అపాయింట్‌మెంట్‌ దొరికినట్టు తెలుస్తోంది. బడ్జెట్‌లో నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు చెబుతూనే ఇంకా తేలాల్సిన అంశాలపై మాట్లాడనున్నారు. ముఖ్యంగా పోలవరం నిధుల అంశంపై చర్చించనున్నారు. 


శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కీలకమైన భేటీల్లో పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖమంత్రితో సమావేశమై పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. డయాఫ్రమ్‌వాల్‌పై నిపుణులు ఇచ్చిన నివేదికపై సమాలోచనలు జరిపారు. తక్షణం ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని ఆయన్ని రిక్వస్ట్ చేశారు. 


సమావేశం అనంతర ఏపీ నీటుపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఏపీని కరవురహిత రాష్ట్రంగా మార్చే జీవనాడి పోలవరం నిర్మాణంపై చాలా కమిట్మెంట్‌తో ఉన్నామన్నారు. గత ఐదేళ్లు పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అధికారంలో కొనసాగి ఉంటే ఈపాటికి పోలవరం పూర్తి అయ్యేదన్నారు. కానీ రివర్స్ టెండరింగ్ అంటూ ఏకపక్షంగా వైసీపీ తీసుకున్న నిర్ణయాలు పోలవరాన్ని ప్రశ్నార్థం చేశారని ధ్వజమెత్తారు. వాళ్ల నిర్వాకంతోనే డయాఫ్రం దెబ్బతిందని.. పనులు 30 శాతం వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. 


జరిగిన నష్టాన్ని సరిదిద్ది వీలైనంత త్వరగా పోలవరం పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నామన్నారు రామానాయుడు. కేంద్రంతో గంటలపాటు పోలవరంపైనే చర్చలు జరుపుతున్నామని వివరించారు. నవంబర్ నుంచి సీజన్ ప్రారంభమయ్యే నాటికి ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డిజైన్లను అప్రూవల్ ఇతర విషాయలపై  చర్చించామన్నారు. కొత్తడయాఫ్రం నిర్మాణం ప్రస్తావించామన్నారు. 


నిర్మాణ ఏజెన్సీ మార్పు అంశాన్ని చర్చించామని అదే చేసి వైసీపీ తప్పు చేసిందని ఇప్పుడు మరోసారి ఏజెన్సీ మార్చడం మంచిదికాదనే అభిప్రాయపడ్డారు. పాత అంచనాలతోనే డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మాణానికి  కొత్త ఏజెన్సీ సాగించాలని నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. ఆసంస్థకి కూడా నిర్మాణ బాధ్యత ఉంటుందన్నారు.