Communal Tension in Rajasthan: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ అట్టుడుకుతోంది. పలు చోట్ల 144 సెక్షన్ విధించారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి విద్యార్థి మరో విద్యార్థిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. ఇవి కాస్తా ఉద్రిక్తంగా మారాయి. అప్రమత్తమైన పోలీసులు అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు. పరిస్థితులను బట్టి ఈ ఆంక్షలు కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకోనున్నారు. సిటీలోని మార్కెట్‌లు అన్నీ మూతబడ్డాయి. పలు చోట్ల పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చేశారు. విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. అక్కడ ఎలాంటి గొడవలు కాకుండా పోలీసులు మొహరించారు.
ఏం జరిగింది..?
ఉదయ్‌పూర్‌లోని స్కూల్‌లో పదోతరగతి విద్యార్థి అదే స్కూల్‌లోని విద్యార్థిని కత్తితో పొడిచాడు. అయితే..ఎందుకు ఈ దాడి చేశాడన్న కారణం తెలియలేదు. కానీ అప్పటి నుంచి స్థానికంగా మాత్రం అల్లర్లు మొదలయ్యాయి. ఇది క్రమంగా మతపరమైన ఘర్షణలకు దారి తీసింది. పొడిచిన వ్యక్తి ముస్లిం కావడం వల్ల స్థానికంగా హిందువులు భగ్గుమన్నారు. పలు చోట్ల మార్కెట్లలోనూ గొడవలు జరిగాయి. పలు చోట్ల మూక దాడులు జరిగాయి. వాహనాలు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఓ షాపింగ్ మాల్‌పైనా దాడి చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి బాధితుడిని ICUలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని వైద్యులు వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ ఘటనపై స్పందించారు. పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: Viral Video: అటల్ సేతుపై నుంచి దూకబోయిన మహిళ, చాకచక్యంగా కాపాడిన క్యాబ్ డ్రైవర్ - షాకింగ్ వీడియో