Karnataka Elections 2023:
పాయిజన్ పాలిటిక్స్
కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల డోస్ పెరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని విషసర్పం అని చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. కేంద్ర మంత్రులంతా కాంగ్రెస్‌పై మండి పడ్డారు. వెంటనే వివరణ ఇచ్చారు ఖర్గే. అయినా బీజేపీ చల్లబడలేదు. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే యత్నాల్ ఖర్గే కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీని విషకన్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొప్పల్‌లో ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే...ప్రపంచమంతా ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతోందని వెల్లడించారు. ఇదే క్రమంలో సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె పాకిస్థాన్, చైనాకి ఏజెంట్‌లా పని చేశారంటూ మండి పడ్డారు.
"ప్రపంచమంతా ప్రధాని నరేంద్ర మోదీ పని తీరుని ప్రశంసిస్తోంది. ఒకప్పుడు ఆయన అమెరికా వెళ్లాలనుకుంటే ఆ దేశం వీసా ఇవ్వలేదు. ఆ తరవాత అదే అమెరికా ప్రధానికి రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించింది. అలాంటి వ్యక్తిని ఖర్గే విషసర్పం అని విమర్శించారు. ఆయన విషం చిమ్ముతారంటూ ఏవేవో మాట్లాడారు. అలా అయితే సోనియా గాంధీని విషకన్య అనాలా..? ఎందుకంటే ఆమె పాకిస్థాన్, చైనాకి ఏజెంట్‌లా పని చేశారు"
- యత్నాల్, బీజేపీ ఎమ్మెల్యే