బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ప్రతిపక్షాలు చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి. వాళ్లంతా లంచాలు తీసుకుంటున్నట్టు సీఎం దగ్గర సాక్ష్యాలు ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.
పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి తోకలు కత్తిరిస్తానంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టు కథనాలు వస్తున్నాయి. ప్రింట్ మీడియాలో కూడా ఇదే స్టోరీలు రావడంతో వాటిని ట్యాగ్ చేస్తూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
కేసీఆర్ సర్కార్ 30 శాతం కమిషన్ సర్‌కార్ అంటూ వంగ్యంగా ట్వీట్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ మీడియాలో వచ్చిన కథనాలను ట్యాగ్ చేశారు.
షర్మిల ఫైర్
తప్పు చేస్తే నా బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్.. ఇప్పుడు ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని ఒప్పుకున్నావు కదా? చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారు.... వాళ్ల చిట్టా ఉందని చెప్తున్నా కేసీఆర్ వాళ్లను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదని నిలదీశారు. ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసారే... మరి ఆ అనామకుడికున్న విలువ మీకు లేదా అని క్వశ్చన్ చేశారు. మీ దగ్గర చిట్టా ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు కేసీఆర్? అని ట్వీట్ చేశారు.
ఒక వేళ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే... లిక్కర్ స్కామ్‌లో కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారనే వెనుకాడుతున్నారని ఎద్దేవా చేశారు షర్మిల. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కళ్లు తుడుచుకొని చూస్తున్నారని ఆరోపించారు. బంగారు బతుకమ్మే బాగా లేనప్పుడు.. ఇతరులను శిక్షించే అర్హత కేసీఆర్‌కు ఎక్కడిదని అభిప్రాయపడ్డారు.
అసలు కేసీఆర్ ప్రభుత్వానికి పాలించే స్థాయి ఎక్కడిది అని ప్రశ్నించారు. అవినీతి పాలనలో మునిగి తేలిన కేసీఆర్‌కు, ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారని అభిప్రాయపడ్డారు. అధికారాన్ని దూరం చేస్తారని హెచ్చరించారు.