Karnataka Assembly Election 2023:
ఓటు వేసిన సుధామూర్తి
ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి ( Infosys Chairperson Sudha Murty) కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే వచ్చి లైన్‌లో నించుని ఓటు వేశారు. ఆమెతో పాటు భర్త నారాయణ మూర్తి కూడా ఉన్నారు. ఓటు వేసిన తరవాత సుధామూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. యువత తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటు వేసిన వాళ్లకే మాట్లాడే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. ఇంత ముసలి వాళ్లమైనా ఉదమయే లేచి వచ్చి ఓటు వేశామని, యువత ఇంత కన్నా చురుగ్గా ఉండాలని అన్నారు.
"నేనెప్పుడూ యువతకు ఇదే మాట చెబుతున్నాను. వచ్చి ఓటు వేయండి. అప్పుడే మీకు మాట్లాడే అధికారం ఉంటుంది. ఓటు వేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు. మమ్మల్ని చూడండి. ముసలి వాళ్లమైపోయాం. అయినా ఉదయం 6 గంటలకే లేచి వచ్చి ఓటు వేశాం. మా నుంచి ఇదే నేర్చుకోండి. డెమొక్రసీలో ఓటు వేయడానికి మించిన పవిత్రమైన పని ఇంకేదీ ఉండదు"
- సుధామూర్తి, ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్
నారాయణ మూర్తి కామెంట్స్..
ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం ఎంత ముఖ్యమో ప్రతి ఇంట్లోని పెద్దలు యువతకు చెప్పాలని సూచించారు. ఇన్‌ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
"పిల్లలకు ఓటు హక్కు గురించి చెప్పడం పెద్దలందరి బాధ్యత. ఓటు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో వాళ్లకు వివరించాలి. మా తల్లిదండ్రులు అలా చేశారు కాబట్టే మేం ఓటు విలువ తెలుసుకున్నాం. ఓటు వేయని వాళ్లకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. ఓటు వేసిన తరవాతే ఎవరు ఎలా పని చేస్తున్నారని వాదించుకోవచ్చు. ఓటు వేయకపోతే ఈ అధికారాన్ని కోల్పోతాం"
- నారాయణమూర్తి, ఇన్‌ఫోసిస్ ఫౌండర్
ఓటు వేసిన బొమ్మై..
ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఓటు వేసిన తరవాత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమైన నేతలందరూ ప్రచారం చేయడం తమకు కలిసొస్తుందని అన్నారు. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతునిచ్చారని వెల్లడించారు. కర్ణాటక అభివృద్ధి కోసం అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అటు కాంగ్రెస్ కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది. "40%" కమీషన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయాలంటే అందరూ ఓటు వేయాలని సూచించారు రాహుల్ గాంధీ. ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తాము ఇచ్చిన 5 హామీలను ప్రస్తావిస్తూ...వాటిన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
Also Read: The Kerala Story: సుప్రీంకోర్టుకి కేరళ స్టోరీ మూవీ మేకర్స్, బ్యాన్ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్