Karnataka Assembly Election: 


ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు..


జనతా దళ్ సెక్యులర్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ లోక్‌సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఐక్యతనూ ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక్కటి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆయన చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. కాంగ్రెస్ ముందు తన సొంత సమస్యల్ని పరిష్కరించుకోవాలంటూ సుతి మెత్తగా చురకలు అంటించారు. ప్రతిపక్షాల ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని తేల్చి చెప్పారు. PTI వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు దేవెగౌడ. కర్ణాటకలో మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్‌ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా భావిస్తున్నారంతా. దేవెగౌడ మాత్రం...ఈ సారి JDS కచ్చితంగా ఎక్కువ మొత్తంలో సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు. తమ పార్టీ అధికారంలోకి కూడా వస్తుందని తేల్చి చెప్పారు. పంచరత్న కార్యక్రమం ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నామని అన్నారు. జేడీఎస్‌కు కేవలం ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో మాత్రమే బలం ఉందని జాతీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయని మండి పడ్డారు. అదంతా అసత్య ప్రచారం అని అన్నారు. 


"వచ్చే ఎన్నికల్లో మా పార్టీదే హవా. కర్ణాటక వ్యాప్తంగా మా ప్రభావం తప్పకుండా ఉంటుంది. కేవలం బీజేపీ, కాంగ్రెస్‌పైనే దృష్టి సారించిన వాళ్లు కూడా ఫలితాలు వచ్చాక షాక్ అవుతారు. మేం ప్రజల్ని రకరకాల పేర్లతో విభజించి ఓట్లు అడగడం లేదు. ఆర్థికంగా, సామాజికంగా వాళ్లను ఒక్కటి చేసే విధానాలనే అనుసరిస్తున్నాం. ఆ అజెండా ఆధారంగానే మేం ఓట్లు అడుగుతాం. కచ్చితంగా మా పార్టీయే అధికారంలోకి వస్తుంది. మా విధానం ఒక్కటే. కష్టపడి చేయాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. వాళ్లకు అబద్ధాలు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి విడదీయకుండా ఉండాలి"


- దేవెగౌడ, జేడీఎస్ చీఫ్ 


సొంతగానే 123 సీట్లు సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు దేవెగౌడ. రాహుల్‌పై అనర్హతా వేటు వేయడంపైనా స్పందించారు. 


"రాహుల్‌ అనర్హతా వేటుపై నేను ప్రత్యేకంగా స్పందించాలని అనుకోడం లేదు. ఇప్పటికే మా పార్టీ సీనియర్ నేతలు వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. అలా జరగకుండా ఉండాల్సింది. నిజంగా ఇది దురదృష్టకరం"


- దేవెగౌడ, జేడీఎస్ చీఫ్ 


రాహుల్ న్యాయపోరాటం..


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు పడినప్పటి నుంచి ఆయన లీగల్‌గా ఎలా ప్రొసీడ్ అవుతారు అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మధ్యే ఎన్‌సీపీకి చెందిన ఎంపీ...తనపై పడిన అనర్హతా వేటు నుంచి తప్పించుకున్నారు. మళ్లీ ఎంపీ పదవిని సంపాదించుకున్నారు. అప్పటి నుంచి రాహుల్ పై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ అదే కోర్టులో ఆయన పిటిషన్ వేయనున్నారు. ఇప్పటికే ఈ పిటిషన్‌ రెడీ అయిపోయిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ఈ లీగల్ ప్రొసీడింగ్స్‌ను దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. సూరత్‌లోని సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే రాహుల్‌పై ఆరు పరువు నష్టం దావా కేసులు నమోదయ్యాయి. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాట్నాలోనూ ఈ కేసు నమోదైంది. పాట్నా కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది కూడా. ఏప్రిల్ 12వ తేదీలోగా విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. సూరత్ సెషన్స్ కోర్టులో వేసే పిటిషన్‌నే పాట్నా, రాంచీ కోర్టుల్లోనే సబ్మిట్ చేయాలని చూస్తోంది కాంగ్రెస్.


Also Read: Sharad Pawar: సావర్కర్ వివాదాన్ని పక్కన పెట్టండి, చర్చించడానికి ఇంకెన్నో సమస్యలున్నాయి - శరద్ పవార్