Sharad Pawar on Savarkar:


బీజేపీపై ఫైర్..


సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై ఇంకా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలనే టార్గెట్ చేసుకుని పదేపదే రాహుల్‌పై ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా ఈ కామెంట్స్‌పై స్పందించారు. దేశం కోసం సావర్కర్ చేసిన త్యాగాన్ని మరిచిపోలేమని స్పష్టం చేశారు. అలా అని ఆయనపై వస్తున్న విమర్శల్ని జాతీయ సమస్యగా మార్చొద్దని సూచించారు. దేశంలో ఇంకా ఎన్నో సమస్యలున్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచిన శరద్ పవార్...బీజేపీపై విమర్శలు చేశారు. రాహుల్ యూకేలో ఇండియా గురించి తప్పుగా మాట్లాడారని బేజేపీ పదేపదే ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. విదేశాల్లో ఓ భారతీయ నేత అలాంటి కామెంట్స్ చేయడం కొత్తేం కాదని తేల్చి చెప్పారు. నాగ్‌పూర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఈ అంశాలు ప్రస్తావించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశాక...మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై మీ స్పందనేంటని మీడియా ప్రశ్నించగా ఇలా స్పందించారు పవార్. 


"దాదాపు 18-20 విపక్ష పార్టీలు ఇటీవలే కీలక సమావేశం నిర్వహించారు. దేశంలోని ముఖ్యమైన సమస్యల గురించి చర్చించాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వైఖరేంటి అన్నదే ఇప్పుడు మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం. నిజానికి...ఇప్పుడు సావర్కర్‌ అంశం జాతీయ సమస్య కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. సావర్కర్‌పై మేం రకరకాల కామెంట్స్ చేశాం. కానీ అవేవీ వ్యక్తిగతం కాదు. హిందూ మహాసభకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాం. అలా అని సావర్కర్‌ను తక్కువ చేయడం లేదు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. 32 ఏళ్ల క్రితం పార్లమెంట్‌ సాక్షిగా సావర్కర్‌ ప్రస్తావన తీసుకొచ్చాను. ఆయన ఓ ఆలయాన్ని నిర్మించడమే కాదు. అందులో పూజారిగా వాల్మికీ వర్గానికి చెందిన వ్యక్తిని నియమించారు. అప్పట్లోనే అంత గొప్పగా ఆలోచించారు." 


- శరద్ పవార్, ఎన్‌సీపీ చీఫ్ 


అనవసరమైన విషయాలనే బీజేపీ పదేపదే ప్రస్తావిస్తోందని మండి పడ్డారు శరద్ పవార్. భారత దేశ ప్రజలు మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని స్పష్టం చేశారు. 


"అనవసరమైన విషయాలను ప్రస్తావించడమే బీజేపీ పని. దేశవ్యాప్తంగా ప్రజలు దేని గురించైతే మాట్లాడుకుంటున్నారో, ఏ నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో వాటి గురించి మాట్లాడుకోవటం ముఖ్యం"


- శరద్ పవార్, ఎన్‌సీపీ చీఫ్