Karnataka Election 2023:
సిద్దరామయ్య వర్సెస్ శివకుమార్..
దక్షిణాదిలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక. ఇక్కడి నుంచి మిగతా దక్షిణాది రాష్ట్రాలకూ తమ పార్టీని విస్తరించాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది అధిష్ఠానం. అయితే...ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం బసవరాజు బొమ్మైపై కొంత అసహనం వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ABP CVoter ఒపీనియన్ పోల్‌లోనూ ఇదే వెల్లడైంది. కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ కూడా తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో ఆ పార్టీలో మళ్లీ చీలికలు మొదలైనట్టు కనిపిస్తోంది. అంతర్గత కలహాలతో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ అధిష్ఠానం. కర్ణాటకలో విజయావకాశాలున్నాయని సంబర పడుతున్న సమయంలో మళ్లీ ఇవే విభేదాలు మొదలైనట్టు సంకేతాలొస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిపై రగడ మొదలైంది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగాలని చూస్తున్నారు. అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే...మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఈ రేసులో ఉన్నారు. సీఎం అభ్యర్థిగానే నిలబడాలని భావిస్తున్నారు. దీనిపై ఆయన కుమారుడు డాక్టర్ యతీంద్ర సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
"ఓ కొడుకుగా మా నాన్నే మళ్లీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి పదవిలో ఆయనను చూడాలి. మా నాన్న కోరిక కూడా ఇదే. ఆయనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోగలరు. నాన్న రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారి. కానీ రెండో నియోజకవర్గం ఏంటనేది ఇంకా తేలలేదు. "
- యతీంద్ర సిద్దరామయ్య, సిద్దరామయ్య కుమారుడు
విభేదాలు తప్పవా..?
సిద్దరామయ్య కూడా తనకు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుందని గతంలోనే చెప్పారు. వరుణ, కోలార్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే సీఎం అభ్యర్థిత్వంలో శివకుమార్, సిద్దరామయ్య మధ్య పరోక్ష యుద్ధం మొదలైంది. ఈ కలహాల కారణంగా మరోసారి పార్టీ పతనమయ్యే ప్రమాదముందని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో రెండు వర్గాలుగా చీలిపోయి మాటల యుద్ధం మొదలు పెట్టినా...అది అధిష్ఠానానికి తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాజస్థాన్‌లో సచిన్ పైలట్, అశోక్ గహ్లోట్ వర్గాల మధ్య విభేదాలున్నాయి. ఆ సమస్యనే పరిష్కరించలేకపోతున్నారు మల్లికార్జున్ ఖర్గే. ఇప్పుడు కర్ణాటకలోనూ ఇదే జరిగితే...కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ రెండు రాష్ట్రాలు కూడా చేజారిపోయే ప్రమాదముంది.
ABP CVoter Opinion Poll
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ABP CVoter Opinion Poll వెల్లడించింది. దాదాపు అన్ని కీలకప్రాంతాల్లో ఈ పార్టీకే మెజార్టీ దక్కుతుందని తెలిపింది. సీట్ల పరంగా చూస్తే...గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తరవాత బీజేపీ చేతుల్లోకి అధికారం మారిపోయింది. అయితే...ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే...కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 74,JDSకి 29 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, బీజేపీకి 68 నుంచి 80,JDSకి 23 నుంచి 35 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Bhopal-New Delhi Vande Bharat: మరో వందేభారత్ ట్రైన్ ప్రారంభించిన ప్రధాని, ఈ సారి ఆ రాష్ట్రంలో