Bhopal-New Delhi Vande Bharat:


భోపాల్ టు న్యూ ఢిల్లీ ..
 
మధ్యప్రదేశ్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. భోపాల్ - న్యూఢిల్లీ మధ్య ఈ సర్వీస్‌ కొనసాగనుంది. రాణి కమలపతి స్టేషన్‌ నుంచి పచ్చ జెండా ఊపి ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన వందేభారత్ ట్రైన్‌లలో ఇది పదకొండోది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో తొలి వందే భారత్‌ ట్రైన్ అందుబాటులోకి రావడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం అవుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికీ ఇది పరోక్షంగా ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వేస్‌ ద్వారా చిన్న చిన్న కార్మికులు దేశంలోని నలుమూలలకూ వెళ్లగలుగుతున్నారని, తద్వారా వాళ్లు ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు వీలవుతోందని అన్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‌లో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఔట్‌లెట్‌లు ఏర్పాటవుతున్నాయని, హస్త కళలకూ ప్రాధాన్యత దక్కుతోందని స్పష్టం చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్‌లన్నీ కొత్త హంగులతో కళకళలాడుతున్నాయి. చాలా వరకూ స్టేషన్లలో వైఫై సౌకర్యమూ అందుబాటులోకి వచ్చింది. 900 స్టేషన్లలో CCTVలు ఏర్పాటయ్యాయి. వీటికి తోడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు రావడం ఇండియన్ రైల్వేస్‌ పాపులారిటీని మరింత పెంచింది. క్రమంగా రద్దీ కూడా పెరుగుతోంది. దేశంలోని ఏ మూలకైనా సరే...డిమాండ్ బాగానే ఉంటోంది. ఇలాంటి కీలక తరుణంలో మధ్యప్రదేశ్‌లో వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి రావడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. 






"గతంలో మధ్యప్రదేశ్ ప్రజలు కొన్ని రైళ్లను తమ స్టాప్‌ల వద్ద ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేసే వాళ్లు. ఆ తరవాత వందేభారత్ ట్రైన్ కావాలని డిమాండ్ చేశారు. వాళ్లు అడిగిన కొద్ది కాలానికే ఇది అందుబాటులోకి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. రైల్వే ప్రయాణికులకు ఎన్నో కొత్త సౌకర్యాలు కల్పిస్తున్నాం. బడ్జెట్‌లోని రికార్డు స్థాయిలో రైల్వే శాఖకు కేటాయింపులు చేశాం. గత ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్‌ ప్రస్తావన రాగానే "లోటు బడ్జెట్" అనే మాట వినిపించేది. కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఏటా బడ్జెట్‌ను పెంచుతున్నాం. కేవలం మధ్యప్రదేశ్‌ కోసమే రూ.13 వేల కోట్లు కేటాయించాం'


- ప్రధాని నరేంద్ర మోదీ