నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 58వ రోజు సాగుతోంది. ప్రస్తుతం ఆయన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న (ఏప్రిల్ 1) నారా లోకేశ్ ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా లోకేశ్, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరుతో పట్టణంలో పర్యటిస్తూ.. అందరూ నిజాయతీగా ఉండాలని నీతులు చెబుతారని ఎద్దేవా చేశారు. కానీ, ఆయన మాత్రం గుట్టలను దోచేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. ధర్మవరం సమీపంలో ఎర్రగుట్టను అక్రమించుకొని విలాసంతమైన ఫాంహౌస్ కట్టుకున్నారని ఆరోపించారు.
ఎర్రగుట్ట సమీపంలో నిలబడి ‘ఇది మరో రుషికొండ’గా మారిందని అన్నారు. ‘‘గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. అయితే తాను మాత్రం గుట్టలను దోచేస్తాడు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడు. ఇది మరో రుషికొండ అని,ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
యువగళం పాదయాత్ర 57వ రోజు (శనివారం) 13 కిలో మీటర్లు సాగింది. ఇప్పటి వరకూ లోకేశ్ మొత్తం 732 కిలోమీటర్లు నడిచారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత తదితరులు లోకేశ్ వెంట ఉన్నారు.