Lokesh On Kethireddy : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. లోకేశ్ పాదయాత్రలో  పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ ముందుకు సాగారు. 






చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు


ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారని, అయితే తాను మాత్రం గుట్టలను దోచేస్తారని ఆరోపించారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను కేతిరెడ్డి ఆక్రమించారని మండిపడ్డారు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్ అని లోకేశ్ ట్వీట్ చేశారు.  






సీఎం జగన్ పై విమర్శలు 


ధర్మవరం పట్టణంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగింది. లోకేశ్‌కు టీడీపీ నేతలు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ పాదయాత్రలో ముందుకుసాగారు.  ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రావడం లేదంటూ యువకులు లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు అమలుకావడం లేదంటూ ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ ప్రభుత్వం రాగానే పన్నులు, ధరలు తగ్గిస్తామని, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అనంతరం సీఎం జగన్ పై  లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. పేదల పథకాలను కట్ చేసే కటింగ్ మాస్టర్‌ జగన్‌ అన్నారు. అడ్డగోలు నిబంధనలతో ఫిట్టింగ్ పెట్టే మాస్టర్‌ జగన్‌ అని విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకున్నారని లోకేశ్ ఆరోపించారు. ధర్మవరంలో నాలుగేళ్ల క్రితం పూర్తైన ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకుండా శిథిలావస్థకు చేర్చారన్నారు. తన పాదయాత్రను చూసి  కవర్ చేసుకోవడానికి టిడ్కో ఇళ్లకు కలర్ వేశారని లోకేశ్ ఆక్షేపించారు.