అక్రమ సంబంధాలతో పచ్చటి కాపురాల్లో నిప్పులు పొసుకుంటున్నారు. కణికావేశంలో నిండు ప్రాణాలను సైతం బలిగొంటున్నాయి. తాజాగా అక్రమ సంబంధం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలను బలిగొన్న ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపుతుంది. తమ్ముడు చేసి తప్పుకి కప్పి పుచ్చేందుకు ప్రయత్నం చేసిన అన్నపై కక్ష తీర్చుకున్నారు సొంత గ్రామస్తులు. అయితే చంద్రగిరి సమీపంలో శనివారం రాత్రి వెదురుకుప్పంకు చెందిన నాగరాజు అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నిప్పంటించి చంపేశారు. మాట్లాడుకుందామని పిలిచి గంగుడుపల్లి కురపకణం వద్ద కారులో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తం గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా అక్కడి సర్పంచ్ వ్యవహారంపై నాగరాజును మాట్లాడదామని పిలిచి ఇలా చేశారని స్థానికులు ఆరోపణ. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


నాగరాజు (36) బెంగళూరులో సాఫ్ట్‎వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు తమ్ముడు పురుషోత్తం. పురుషోత్తం స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ ఆ ఊరి సర్పంచ్‌ చాణక్యకు మరదలు (తమ్ముడి భార్య). కరోనా వల్ల లాక్ డౌన్ పెట్టిన సమయంలో వీరిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మహిళ బంధువులకి పురుషోత్తంకి మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఇకపై గొడవలు లేకుండా చేస్తామని నమ్మించి అన్న నాగరాజును మద్యం తాగించటానికి తీసుకువెళ్లి హత్య చేశారని భావిస్తున్నారు. అయితే, నాగరాజును సర్పంచ్‌ చాణిక్య హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్‌ చాణిక్య నాగరాజుతో మాట్లాడాలని పిలిపించి.. మాటల సందర్భంగా ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


నాగరాజును కొట్టి, కాళ్ళు చేతులు కట్టేసి, కార్ డోర్ లాక్ చేసి కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టి సజీవ దహనం చేసి ఉంటారని భావిస్తున్నారు. కారులో మంటలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అప్పటికే కారు మంటల్లో కాలిపోయింది. ఇక, సర్పంచ్‌ చాణిక్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.


నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరణ వార్త తెలుసుకొని వారంతా ఘటనా స్థలానికి చేరుకొని బావురుమని రోధిస్తున్నారు. సర్పంచ్ చాణిక్య సోదరుడు వితింజయ్‌ భార్యతో పురుషోత్తంకు అక్రమ సంబంధం ఉన్న నేపథ్యంలో.. ఈ విషయంపై శివరాత్రి రోజు కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని గ్రామస్థులు తెలిపారు. అనంతరం, పంచాయితీ పెట్టించారు. తాజాగా ఇదే విషయమై మాట్లాడాలని నాగరాజును పిలిపించి దారుణానికి ఒడిగట్టారు.


సంఘటన స్థలంలో చెల్లాచెదురుగా నాగరాజుకు సంబంధించిన వస్తువులు పడి ఉన్నాయి. రోడ్డుపై మెడలోని చైన్, దుస్తులు, చెప్పులు పడి ఉన్నాయి. అయితే, సజీవ దహనం చేసి కారును లోయలోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం దుండగులు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.