నేడు ఉత్తర - దక్షిణ ద్రోణి/గాలి విచ్చిన్నతి దక్షిణ ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు: 
నిన్న తూర్పు మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి /గాలి విచ్చిన్నతి, ఈరోజు బలహీన పడింది. కాబట్టి, రాగల మూడు రోజులు తెలంగాణ  రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 5 వరకూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేశారు.


Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 45 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
ఏప్రిల్, జూన్ మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన వేడి ఉండే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (IMD) శనివారం (ఏప్రిల్ 1) వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతం మినహా, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో, మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది.


ఏప్రిల్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. ఏప్రిల్‌లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ చెబుతోంది. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప ప్రాంతంలోని చాలా ప్రాంతాలలో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, అయితే తూర్పు, ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.