CJI NV Ramana  :  మీడియాపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా సంచలనాత్మక అంశం జరిగినప్పుడు కోర్టుల తరహాలో వ్యవహరిస్తున్నాయని కంగారూ కోర్టులను నడిపిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్‌లా లో జరిగిన జస్టిస్ ఎస్‌బి సిన్హా మెమోరియల్ లెక్చర్‌లో "లైఫ్ ఆఫ్ ఏ జడ్జ్ " అనే అంశంపై ప్రసంగించారు. 


న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న క్లిష్టమైన కేసులలో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా తర్జనభర్జన పడుతున్న సమయంలో మీడియా కంగారూ కోర్టులను నడిపిస్తూ.. తీర్పుల‌ను   ఇస్తోంద‌ని ఆయ‌న అన్నారు. అప‌రిప‌క్వ చ‌ర్చ‌ల ద్వారా ప్ర‌జాస్వామ్య ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్నార‌ని ర‌మ‌ణ ఆరోపించారు. అతి దూకుడు, బాధ్య‌తారాహిత్యం వ‌ల్ల మ‌న ప్ర‌జాస్వామ్యాన్ని రెండు అడుగులు వెన‌క్కి తీసుకువెళ్తున్న‌ట్లు అవుతుందన్నారు. " కంగారూ కోర్టు " లు అంటే.. సంబంధం లేని వ్యక్తులు జోక్యం చేసుకుని వాదనలు వినిపించి.. తీర్పుల తరహాలో అభిప్రాయాలు ప్రకటించడం. 



ప్రింట్ మీడియా ఇంకా కాస్త జవాబుదారీగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం జీరో జ‌వాబుదారీత‌నంతో ఉంద‌ని ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. ఇటీవ‌ల కాలంలో న్యాయ‌మూర్తుల‌పై భౌతిక‌దాడులు పెరుగుతున్నాయ‌ని, ఎటువంటి ర‌క్ష‌ణ లేకుండానే జ‌డ్జిలు స‌మాజంలో జీవించాల్సి వ‌స్తోంద‌న్నారు. రాజ‌కీయ‌వేత్త‌లు, అధికారులు, పోలీసు ఆఫీస‌ర్లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు రిటైర్మెంట్ త‌ర్వాత కూడా సెక్యూర్టీ క‌ల్పిస్తున్నార‌ని, కానీ జ‌డ్జిల‌కు ఇదే త‌ర‌హా ర‌క్ష‌ణ లేకుండాపోయింద‌న్నారు.


 నిర్ణ‌యాత్మ‌క కేసుల్లో మీడియా విచార‌ణ స‌రైంది కాద‌న్నారు. బేధాభిప్రాయాల‌ను ప్ర‌చారం చేస్తున్న మీడియా.. ప్ర‌జ‌ల్లో వైరుధ్యాన్ని పెంచుతోంద‌న్నారు. దీంతో ప్ర‌జాస్వామ్యం బ‌ల‌హీన‌ప‌డుతోంద‌న్నారు. ఇది వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తోంద‌న్నారు. ఈ క్ర‌మంలో న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం ప‌డుతోంద‌ని సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు.  సోష‌ల్ మీడియా ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంద‌ని సీజే అన్నారు. స్వీయ నియంత్ర‌ణ‌తో మీడియా ఉండాల‌న్నారు.  ప‌దాల‌ను మీడియా జాగ్ర‌త్త‌గా వాడాల‌న్నారు. ఎల‌క్ట్రానిక్, సోష‌ల్ మీడియాలు బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌ను విద్యావంతుల‌ను చేసేందుకు, చైత‌న్య‌ప‌రిచేందుకు ఎల‌క్ట్రానిక్ మీడియా త‌న గ‌ళాన్ని వాడుకోవాల‌ని సీజే ర‌మ‌ణ సూచించారు.


ప్రస్తుతం న్యాయవ్యవస్థకు మౌలిక సదుపాయాల కొరత ఎంతో ఉందని పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం అందించాలంటే సౌకర్యాలు ఉండాలన్నారు. అనేక సార్లు తాను ఈ అంశాలను లేవనెత్తానన్నారు. ప్రస్తుత రోజుల్లో న్యాయమూర్తి జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదన్నారు. న్యాయమూర్తుల మీద  భతిక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తర్వాత సరైన రక్షణ పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.