Tomato Price Decrease: గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విపరీతమైన వరదలు వచ్చాయి. దీంతో కూరగాయల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. అయితే అంతకు ముందు వంద దాటిన టమోట ధర మాత్రం క్రమక్రమంగా కిందకు దిగి వచ్చింది. వర్షాల కంటే ముందు హైదరాబాద్ మార్కెట్ లో కిలో టమోటా ధర 80, 60, 50... అలా రిటైల్ మార్కెట్ లో సాగింది. ప్రస్తుతం ఆ ధర 20కి చేరింది. అయితే భాగ్య నగరంలోని కొన్ని చోట్ల కిలో 30 రూపాయల చొప్పున కూడా అమ్ముతున్నారు. 


కిలో టమోటా ధర 5 రూపాయల లోపే.. 


కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద టమాటా మార్కెట్ గా పేరున్న చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్ లో మాత్రం టమాటా ధర దారుణంగా పడిపోయింది. టమాటాకు పుట్టినిల్లుగా భావించే మదన పల్లె మార్కెట్ లో.. మెదటి రకం టమాటా కిలోకి 5 రూపాయలు పలుకుతుంది. ఇక మూడవ రకం టమోటా 2 లేదా 3 రూపాయలు పలుకుతోంది. ఈ ధర విన్న రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పాటకు లాభం రాకపోగా నష్టాలు రావడం చూసి తట్టుకోలేకపోతున్నారు. కనీసం రవాణా ఖర్చులకు కూడా ఆ డబ్బు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రోడ్లపై పారబోస్తూ.. వ్యవసాయ క్షేత్రాల్లోనే వదిలేస్తూ.. 


ఈ విషయం తెలుసుకున్న చాలా మంది టమోటా రైతులు పంటను రోడ్లపై పారబోతున్నారు. కొందరు వ్యవసాయ క్షేత్రాల్లో అలాగే వదిలేస్తున్నారు. దాని వల్ల కనీసం భూమి అయినా గట్టిపడుతుందని భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎక్కవ మొత్తంలో ధర పలికిన టమాటా నేడు పూర్తిగా పడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఓవైపు పంట నష్టం జరిగి.. వరదలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే.. కనీసం ఈ టమాట పంటైన తమ జీవనాన్ని మెరుగుపరుస్తుంది అనకున్నారు. కానీ ఆ అన్నదాతల ఆశలు పూర్తిగా ఆవిరి అయిపోయాయి. కిలో పది రూపాయలకు పైగా ఉండగా.. నేడు  ఆ ధర 5 రూపాయలకు పడిపోయింది.  


పక్క రాష్ట్రాలకు ఎగుమతి..


కాగా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఒడిశా, తమిళ నాడు సహా కర్ణాటకకు కూడా టమోటాలను ఎగుమతి చేస్తుంటారు. నాణ్యమైన టమాట నిన్న మొన్నటి వరకు కిలో 10 రూపాయలకు పైగానే పలికింది. కానీ ఒక్క రోజులోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ వైపు వర్షాలో పంట నష్టం జరుగుతుంటే మరోవైపు మిగిలిన పంటకు అంతంత మాత్రం రైతన్నను కన్నీరు పెట్టిస్తోంది.