విశాఖ పోర్ట్ యాజమాన్యం తన అధీనంలోని స్టేడియాలను లీజుకు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం తాము కూడా స్థిరాస్తుల ద్వారానే ఆదాయం ఆర్జించాలని భావిస్తుంది. ఇప్పటికే పోర్ట్ ఆసుపత్రి వెనుక ఉన్న 17 ఎకరాలను రహేజా గ్రూప్‌నకు కేటాయించింది పోర్ట్ యాజమాన్యం. దీనివల్ల పోర్టుకు 125 కోట్ల వరకూ లభించినట్టు సమాచారం. ఈ లీజు 30 ఏళ్లపాటు కొనసాగనుంది. 


 లీజుకు ఇస్తే ఎలాంటి ఫలితం వస్తుందో గ్రహించిన పోర్టు యాజమాన్యం మరో అడుగు ముందుకేసింది. ఇలా లీజుకు ఇచ్చే వాటిలో తమ ఆధీనంలో ఉన్న స్టేడియంను కూడా రెంట్‌కు ఇవ్వాలని ఆలోచిస్తోంది. అక్కయ్య పాలెంలోని పోర్ట్ స్టేడియాన్ని కూడా లీజుకి ఇస్తామంటుంది. ఈ స్టేడియానికి పెద్ద హిస్టరీనే ఉంది. సరిగ్గా విశాఖ సిటీ నడిబొడ్డున ... నేషనల్ హైవేని ఆనుకొని .. ప్రజలకూ .. మార్నింగ్ వాకర్స్‌కూ అందుబాటులో ఉంది. ఈ స్టేడియం కాంప్లెక్స్‌ లో ఇండోర్ స్టేడియం, అవుట్ డోర్ స్టేడియాలతోపాటు ఒక ఆడిటోరియం కూడా ఉంది. వీటిని కలిపిగానీ .. విడివిడిగా గానీ లీజుకు ఇస్తామని చెబుతున్నారు అధికారులు. 


పోర్ట్‌ స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి లీజుకు ఇస్తే సామాన్యులకు దూరం అవుతుందని.. టికెట్ రేట్లను పెంచేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విశాఖ నగర ప్రజలు. దానితో వారు స్టేడియం కాంప్లెక్స్ ను పోర్ట్ యాజమాన్యం చేతిలోనే ఉంచుకోవాలని కోరుతున్నారు. 


నిర్వహణ వ్యయం తగ్గించడానికే


ఈ విషయంలో పోర్ట్ యాజమాన్యం వెర్షన్ మరోలా ఉంది. ఎవరు నిర్వహించినా పోర్ట్ స్టేడియంలోని సౌకర్యాలు ఎప్పటిలానే ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు అధికారులు. స్టేడియం కాంప్లెక్స్‌ను ఒక్కరికే లీజుకు ఇచ్చినా .. విడివిడిగా ఇచ్చినా వాటిని ప్రైవేటు వారు నిర్వహించుకుని పోర్టుకు కొంత ఆదాయాన్ని ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు. దీని వల్ల నిర్వహణ వ్యయం తప్పడంతోపాటు పోర్ట్‌కు అదనపు ఆదాయం కూడా దక్కుతుంది అని పోర్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే పోర్ట్‌కు అవసరమైనప్పుడు స్టేడియాన్ని వాడుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. 


పోర్ట్ ఉద్యోగులకు డిస్కౌంట్‌పై ఆడిటోరియాన్ని వాడుకునే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. పోర్ట్ స్టేడియంలో ప్రధానంగా కనిపించేది మార్నింగ్ వాకర్స్. వారికి కూడా ఈ లీజు వల్ల ఎలాంటి ఆటంకం ఉండదని.. ప్రస్తుతం కొనసాగుతున్న పద్దతిలానే ఐడెంటిటీ పాసులతో వాకింగ్ చేసుకోవచ్చని అంటున్నారు. ఇవన్నీ వినడానికి బానే ఉన్నా .. ఒకసారికి ప్రైవేటు వ్యక్తులకు స్టేడియాన్ని లీజుకు ఇచ్చాక ఆచరణలో సాధ్యమేనా అన్నది చూడాలి.