Arpita Mukherjee Profile: 


కేసులో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా అర్పిత ముఖర్జీ


ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్‌ సంచలన సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకుంది. అసలు ఈ కేసు మలుపు తిరిగిందే ఈ అర్పిత ముఖర్జీతో. ఆమె ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ఏకంగా రూ.20 కోట్లు నోట్ల కట్టలు దొరికాయి. ఆమె వద్దకు ఇంత డబ్బు ఎలా వచ్చింది..అన్న ప్రశ్నతో మొదలైన విచారణ...ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పుడీ కేసులో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది అర్పిత ముఖర్జీ. ఇంతకీ ఈమె ఎవరు..? పార్థ ఛటర్జీకి, ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..? 


పూజా కమిటీతో పరిచయం...


ఈడీ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే...అర్పిత ముఖర్జీ, పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలు. కాస్తంత లోతుల్లోకి వెళ్తే...వీళ్లిద్దరకీ పరిచయం ఎక్కడ ఏర్పడిందో...తెలుస్తోంది. సౌత్ కోల్‌కతాలోని పార్థ ఛటర్జీ నేతృత్వంలో దుర్గా పూజా కమిటీ నడుస్తోంది. ఈ కమిటీకి ప్రచారకర్తగా ఉండే వారు అర్పిత ముఖర్జీ. క్యాంపెయిన్‌లు కూడా నిర్వహించేవారు. ఈ పూజా కార్యక్రమాలకు పార్థ ఛటర్జీ తరచుగా హాజరయ్యేవారు. ఆ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అంతే కాదు. బెంగాలీ, తమిళ్, ఒడియా చిత్రాల్లో నటించటం వల్ల అర్పిత ముఖర్జీ పేరు అందరికీ సుపరిచితమైంది. ఇక కమిటీకి సంబంధించిన పనుల్లోనూ చురుగ్గా ఉండటం వల్ల పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ మధ్య సాన్నిహిత్యం బలపడింది.