ఏపీలో స్కూళ్లు మొదలై మూడు వారాలు గడుస్తున్నా ఇంకా పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో పిల్లలకు అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా 4, 8 తరగతుల పిల్లలకు పుస్తకాల కొరత ఉంది. మిగతా విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఆ రెండు క్లాస్‌లకు మాత్రం లేవు అని చెబుతున్నారు. దీంతో ఆ రెండు క్లాస్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్ మొదలై మూడు వారాలవుతున్న టెక్స్ట్ బుక్స్ లేకపోవడం కాస్త ఇబ్బందికర పరిమామమే. ఎనిమిదో తరగతికి సిలబస్ మారింది కాబట్టి కనీసం పాత పుస్తకాలు చదువుకునే వీలు కూడా లేదు. 


ఈ ఏడాదే ఎందుకు..?
ఈ ఏడాది ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రైవేట్ స్కూల్స్ కి కూడా ప్రభుత్వం ప్రింట్ చేసే పుస్తకాలే పంపిస్తామని చెప్పింది. గతంలో బయట షాపుల్లో కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా ప్రైవేట్ స్కూల్స్ కి పాఠ్యపుస్తకాల సెట్లు పంపిస్తుంది. వాటి రేటు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అంతకు మించి స్కూల్ యాజమాన్యాలు తీసుకోవడానికి వీలు లేదు. దీంతో ప్రైవేటుకి సరఫరా తగ్గింది. అంటే అటు ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు అందుబాటులోకి రాక, ఇటు ప్రైవేటుగా కొనుక్కునే వీలు లేక విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. 


నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఇలా..
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లు - 3,376
విద్యార్థుల సంఖ్య - 2,37,597
ప్రైవేట్ స్కూల్స్ - 925
విద్యార్థులు- 1,17,089
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మొత్తంగా 19,47,459 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 18,64,691 పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రైవేట్ స్కూల్స్ విషయానికొస్తే 12 లక్షల పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 5,96,150 పుస్తకాలు మాత్రమే వారికి అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాకు చేరిన పుస్తకాలను 90 శాతం ఆయా మండల కేంద్రాలకు చేర్చారు అధికారులు. వాటిని రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తారు. మరికొన్ని పుస్తకాలు జిల్లా కేంద్రంలోనే ఉండిపోయాయి. వాటిని 12 మండలాలకు చేర్చాల్సి ఉంది. ప్రైవేట్‌ పాఠశాలలకు కావాల్సిన పుస్తకాలు వచ్చినవి వచ్చినట్లు పంపిణీ చేస్తున్నా అవి సరిపోవడం లేదు. 


గతంలో ప్రైవేట్ స్కూల్స్ ముందుగానే పుస్తకాలు తెప్పించి ఉంచేవి. లేకపోతే బహిరంగ మార్కెట్ లో వాటిని కొనుగోలు చేయాలని విద్యార్థులకు సూచించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచే తప్పనిసరిగా కొనాల్సి వస్తుండే సరికి, వాటి సరఫరా కోసం యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా పుస్తకాలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాలను నిలదీస్తున్నారు. తమ తప్పేమీ లేదని, ప్రభుత్వం సరఫరా చేయడం లేదని వారు వాపోతున్నారు.