ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని వైఎస్సార్‌సీపీ నేతలకు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం మొదలైన తర్వాత ఇప్పటికే రెండుసార్లు రివ్యూ మీటింగ్ జరిగింది. తాజాగా జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల రివ్యూ మీటింగ్ లో కూడా గడప గడప కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం జగన్. గడప గడపకు విజయవంతం చేయాల్సింది పార్టీ జిల్లా అధ్యక్షులేనని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితేనే.. వచ్చేసారి ఎన్నికల్లో ఆయా ఎమ్మెల్యేలను జనం ఆశీర్వదిస్తారనేది జగన్ ఆలోచన. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం జగన్ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందులో ఒకరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


గుండె సమస్య నుంచి కోలుకోగానే గడపగడపకు.. 
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పగడ్బందీగా మొదలుపెట్టారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే అనుకోకుండా ఆయన గుండె సమస్యతో సతమతం అయ్యారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స అనంతరం నెల్లూరు చేరుకున్న ఆయన తిరిగి అదే జోరుతో గడప గడప కార్యక్రమాన్ని చేపట్టారు. అలుపూ సొలుపూ లేకుండా ముందుకు కదులుతున్నారు. 




జోరు వానలోనూ గడపగడపలో తగ్గని జోరు.. 
జోరు వానలో కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని కొనసాగించారు. నెల్లూరులోని 20వ డివిజన్ నుండి ఆయన ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. అప్పటికే జోరు వాన, అయినా సరే ఆయన లెక్క చేయకుండా వర్షంలోనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా....? అంటూ ప్రతీ ఒక్కరినీ అడుగుతూ... ప్రతి గడపకు తిరుగుతున్నారు. సంక్షేమ పథకాలు అందకపోతే తనకు వెంటనే తెలియజేయాలని ప్రజలకు సూచించారు. 


ఇటీవల సీఎం జగన్ గడప గడప రివ్యూలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు తలంటారు. గడప గడప కార్యక్రమాన్ని సదరు ఎమ్మెల్యే ప్రారంభించలేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన టీమ్ ఐ ప్యాక్ నివేదిక ఇవ్వడంతో ఆయన సీరియస్ అయ్యారని సమాచారం. అయితే నవ్వుతూనే ఆ కార్యక్రమం సీరియస్ నెస్ ని తెలియజేశారని, ప్రజల్లో ఎమ్మెల్యేలకు ఉన్న ఇమేజ్ ఆధారంగా, ప్రజలకు వారు ఎంతమేర చేరువయ్యారన్న నివేదికల ఆధారంగానే 2024 ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని చెప్పారు. అలాంటి ఎమ్మెల్యేలు ఉన్న నెల్లూరు జిల్లాలో, ఇలా వర్షంలో సైతం గడప గడపకు ఆపకుండా పూర్తి చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తమ్మీద సీఎం జగన్ ఆదేశాలతో ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్నారని అర్థమవుతోంది.