Minister Kakani : రైతులకు ఉచిత విద్యుత్ మీద మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. రైతులకు నాణ్యమైన విద్యుత్ ని ఉచితంగా మరింత మెరుగ్గా అందించేందుకే మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లో ఓల్టేజీ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతోనే నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని అన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించినంత మాత్రాన రైతులపై భారం పడదని, వారు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేసిన తర్వాతే వాటిని, విద్యుత్ సంస్థలు తీసుకునే విధంగా నూతన విధానాన్ని రూపొందించామని, ఈ విషయంలో రైతుల్ని రెచ్చగొట్టడం తగదన్నారు. టీడీపీ నిర్వహించిన రైతు సదస్సు అట్టర్ ఫ్లాపైందని అన్నారు కాకాణి. 


టీడీపీ రైతు సదస్సులు


ఇటీల వ్యవసాయ మీటర్లకు మోటర్లు అమర్చుతున్నారే అంశంపై టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహిస్తోంది. వివిధ నియోజకవర్గాల నుంచి రైతులను ఆహ్వానించి పెద్ద ఎత్తున నిరసన సభలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా మనుబోలులో వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభ నిర్వహించారు. కాకాణి నియోజకవర్గంలో సభ పెట్టి తన సత్తా చూపానంటున్నారు సోమిరెడ్డి. దీనికి కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టిన కాకాణి, టీడీపీ సభ అట్టర్ ఫ్లాపైందన్నారు. 


టీడీపీకి ఆ అర్హత లేదు


రైతాంగం పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అన్ని విధాలా బడుగు రైతులకు ఉపయోగంగా ఉన్నాయని అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం అడుగులు వేసిన ప్రతిసారి టీడీపీ అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు. రైతులకు సంబంధించి మోటర్లకి మీటర్లు అని రాద్ధాంతం చేస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని చెప్పారు కాకాణి. రైతులకు ఉచిత విద్యుత్ మీద మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు అస్సలు లేదన్నారు కాకాణి. కరెంట్ తీగలపై బట్టలు అరేసుకోవలన్న చంద్రబాబు ఇవాళ కరెంట్ పై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారాయన. 


నాణ్యమైన విద్యుత్ అందించేందుకు


వైసీపీ హయాంలో 9 గంటల ఉచిత విద్యుత్ ని పగటి పూటే ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. రైతులకు మెరుగ్గా నాణ్యమైన విద్యుత్ అందించేందుకే మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.  రైతుల్ని రెచ్చకొట్టడం చంద్రబాబు కి అలవాటు అయిపోయిందని ఎద్దేవా చేశారు. 2019కి ముందు ఉన్న బకాయిలని తమ ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు కాకాణి. 1700 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి రైతాంగానికి విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకు విద్యుత్ కనెక్షన్లు వారి పేరు మీద మార్చే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రైతులు వైసీపీ ప్రభుత్వం పై కృతజ్ఞతతో ఉండడాన్ని టీడీపీ, జనసేన ఓర్చుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. టీడీపీ హయాంలో కనీసం గంటైనా పూర్తి విద్యుత్ ఇచ్చారా అని నిలదీశారు. టీడీపీ చేపట్టిన రైతు పోరుకు రైతులెవరూ రాలేదని, రైతు వేషాల్లో టీడీపీ నేతలు వచ్చారని చెప్పారు.