Etela Rajender : టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులపై పగపట్టిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తాను రాజు అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పరిష్కరిస్తా అని చెప్పి సాచివేత, ముసలి కన్నీరు తప్ప గిరిజనులకు నిజమైన పరిష్కారం దొరకలేదన్నారు.  హైదరాబాద్ చుట్టూ ఉన్న అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం రియల్ఎస్టేట్ ఏజెంట్ లా మారిందన్నారు. పేదవారి పొట్టగొట్టి డబ్బున్నోళ్లకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. జంతువులకు ఇచ్చే విలువ కూడా మనుషులకు కేసీఆర్ ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. 


సీఎం కేసీఆర్ కు గిరిజన సమస్యలు పట్టవు


పోడుభూములపై తార్నాకలోని భూమిసంవాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.  ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజనుల మీద పగపట్టారన్నారు. సంఘాలు ఉండవద్దు, తాను రాజును అని కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు.  సొంత పార్టీ ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నా కూడా గిరిజన సమస్యలు సీఎం కేసీఆర్ వినడంలేదన్నారు. అధికార పార్టీకి చెందిన వారినే జైల్లో పెడుతున్నారన్నారు.  పోడు భూములు, అన్నలు పంచిన భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. 97 వేల మందికి 3 లక్షల ఎకరాలు ఇచ్చిన అని చెప్పున్న భూములన్నింటికీ హద్దులు నిర్ణయించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.  2015లో పెట్టుకున్న దరఖాస్తులు పరిష్కరించాలన్నారు.  


పోరాటం ఫారెస్ట్ అధికారుల మీద కాదు సీఎంపై 


'సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని పరిష్కరిస్తా అని చెప్పి మాట దాట వేస్తున్నారు. కేసీఆర్ మాటలు అన్నీ సాచివేత, ముసలి కన్నీరు తప్ప నిజమైన పరిష్కారం కల్పించడం లేదు. పార్టీలు కూడా కంటితుడుపు చర్యగా ప్రకటనలు చేస్తున్నారు తప్ప కార్యాచరణ లేదు. మన పోరాటం ఫారెస్ట్ అధికారుల మీద కాదు ఈ సీఎం మీద. నిజంగా కేసీఆర్ కి చిత్త శుద్ధి ఉంటే అడవుల్లో చెట్లు లేని చోట మొక్కలు నాటాలి తప్ప. శివారుల్లో ఉన్న భూములపై దౌర్జన్యం చేయవద్దు.  మహబూబ్ బాద్ జిల్లా  నారాయణ పూర్ లో  1480 ఎకరాల భూమినీ భూస్వాముల పేరు మీద ఉంది. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనులు లబో దిబో అంటున్నారు.  ధరణి తెచ్చి ఈ భూములు మావి. మీ వర్గాలకు భూములు ఎక్కడివి అని చెప్పాలి అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారు. మీరంతా కూలోల్లు, జీతగాల్లు మీకు ఎక్కడిది భూమి అనేది సీఎం భావన కావొచ్చు. 2006-07 లో రింగ్ రోడ్ వచ్చినప్పుడు పట్టా భూములకు ఎలా పరిహారం చెల్లిస్తారో అలానే అసైన్డ్ లాండ్లకు కూడా పరిహారం ఇస్తామన్నారు.  హైదరాబాద్ చుట్టూ ఉన్న అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం రియల్ఎస్టేట్ ఏజెంట్ గా మారింది. పేదవారి పొట్టగొట్టి డబ్బున్న వారికి కట్టబెడుతుంది. 2005 చట్టం కంటే ముందు ఉన్న పోడు భూములపై సాగు చేసుకుంటున్న వారికి హక్కుపత్రాలు ఇవ్వాలి.'- ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే