IT Firm to Retain Employees: కరోనా మహమ్మారి తర్వాత డిజిటలైజేషన్‌ వేగంగా పెరిగింది. సంప్రదాయ కంపెనీలు డిజిటల్‌ బాట పట్టడంతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు పెరిగాయి. దాంతో అనుభవంతో పాటు నైపుణ్యాలున్న ఉద్యోగులకు డిమాండ్‌ ఎక్కువైంది. ఫలితంగా అట్రిషన్‌ రేట్‌ పెరిగింది. దీనిని అడ్డుకొనేందుకు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో వంటి కంపెనీలు కొత్త దారులు అనుసరిస్తున్నాయి. వేతనాలను భారీగా  పెంచుతున్నాయి. అంతేకాకుండా మిడ్‌ టర్మ్‌ హైకులు, ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు ఇస్తున్నాయి.


ఐటీ కంపెనీ విప్రో 2022, జూన్‌ త్రైమాసికం ఫలితాలను ఈ మధ్యే విడుదల చేసింది. జులై నుంచి ప్రతి మూడు నెలలకు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించింది. వచ్చే నెల నుంచి వేతనాలు భారీగా పెంచుతున్నామని వెల్లడించింది. సామర్థ్యం గల ఉద్యోగులకు రీటెన్షన్‌ బోనస్‌, వేతన సవరణలు చేపడుతున్నామని ఇతర కంపెనీలు చెబుతున్నాయి.



టీసీఎస్‌లో చివరి త్రైమాసికంలో అట్రిషన్‌ రేటు 19.7 శాతంగా ఉంది. గత ఆరు నెలలుగా ఈ కంపెనీ అత్యధిక అట్రిషన్‌ రేటుతో ఇబ్బంది పడుతోంది. 2022, మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇది 17.4 శాతంగా ఉండటం గమనార్హం. తెలివైన ఉద్యోగులను తమవద్దే ఉంచుకొనేందుకు ఫ్లెక్సిబిలిటీ, హైబ్రీడ్‌ మోడల్‌ను అనుసరిస్తున్నామని కంపెనీ తెలిపింది. హెచ్‌సీఎల్‌ కంపెనీ అట్రిషన్‌ రేటు 23.8 శాతంగా ఉంది.


2023 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో విప్రో అట్రిషన్‌ రేటు అత్యధికంగా 23.3 శాతంగా ఉంది. కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది కాస్త తక్కువే కావడం గమనార్హం. గతేడాది చివరి క్వార్టర్లో అట్రిషన్‌ రేటు 23.8 శాతంగా ఉండటం గమనార్హం. 'మానవ వనరులపై మేం పెడుతున్న పెట్టుబడికి ఫలితాలు వస్తున్నాయి. ఇక నుంచి ఏడాది కాకుండా మేము మూడు నెలల ప్రమోషన్‌ సైకిల్‌ను అనుసరించబోతున్నాం. జులై నుంచే ఇది అమల్లోకి వస్తుంది. 2022 సెప్టెంబర్లో అర్హత ఉన్నవారికి వేతనాలు పెరుగుతాయి' అని విప్రో సీఈవో, ఎండీ డెలాపోర్ట్‌ పేర్కొన్నారు.


Also Read: బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టేసిన గౌతమ్‌ అదానీ - ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానానికి ఇండియన్‌


Also Read: 10 పైసలు పెరిగిన రూపాయి! వీకెండ్లో భారీగా లాభపడ్డ సెన్సెక్స్‌, నిఫ్టీ