Gautam Adani Surpasses Bill Gates:  భారత వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) సంపద సృష్టిలో రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ బిలియనీర్స్‌ జాబితాలో మైక్రోసాఫ్ట్‌ స్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం అదానీ సంపద 115.5 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా గేట్స్ 104.6 బిలియన్‌ డాలర్లతో ఉన్నారు.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 90 బిలియన్‌ డాలర్లతో పదో స్థానంలో నిలిచారు. స్పేస్‌ ఎక్స్‌, టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 235.8 బిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం.


చిరు వ్యాపారంతో ప్రస్థానం మొదలుపెట్టిన గౌతమ్‌ అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. పోర్టులు, గనులు, గ్రీన్‌ ఎనర్జీ సహా ఎన్నో రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు.


'గత రెండేళ్లలో అదానీ గ్రూప్‌లోని కొన్ని నమోదు నమోదిత కంపెనీల షేర్లు 600 శాతం వరకు ఎగిశాయి. ప్రధాని మోదీ కలలుగన్న 2.9 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ కోసం గ్రీన్‌ ఎనర్జీ, మౌలిక వసతుల ప్రాజెక్టులో ఆయన పెట్టుబడులు పెట్టారు. 2070 కల్లా భారత్‌లో కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకొచ్చేందుకు సాయపడుతున్నారు' అని అదానీ గురించి బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు చేసింది.


'కేవలం మూడేళ్లలోనే దేశంలోని ఏడు విమానాశ్రయాలపై అదానీ నియంత్రణ సాధించారు. భారత్‌లోని మొత్తం ఎయిర్‌ ట్రాఫిక్‌లో వీటికి 25 శాతం వాటా ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌ పోర్టు ఆపరేటర్‌, పవర్‌ జనరేటర్‌, సిటీ గ్యాస్‌ రిటైలర్‌ ఆయన గ్రూప్‌లోనే ఉన్నాయి' అని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. కాగా ఈమధ్యే గెడాట్‌తో కలిసి ఇజ్రాయెల్‌లోని ఓ పోర్టు ప్రైవేటైజేషన్‌ టెండర్‌ గెలిచామని అదానీ తెలిపారు. ఆ దేశానికి ఉన్న మూడు పెద్ద పోర్టుల్లో హయిఫా పోర్టు అతి పెద్దది.


Also Read: 6 నెలల్లో ఈ అదానీ కంపెనీ షేరు కోట్లు కురిపిస్తుందట!


5G Spectrum Auction: అదానీ గ్రూప్‌ టెలికాం రంగంలోకి ప్రవేశించడం ఖాయమే! 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో ఆ కంపెనీ పాల్గొంటోందని స్పష్టమైంది. అదానీ డేటా నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి దరఖాస్తులు అందాయని టెలికాం శాఖ తెలిపింది. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz and 26 GHz బ్యాండ్స్‌ హక్కులను దక్కించుకొనేందుకు వీరు పోటీపడతారని వెల్లడించింది.


అదానీ గ్రూప్‌ రాకతో స్పెక్ట్రమ్‌ వేలం పోటీ మరింత పెరుగుతుందని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 'ప్రైవేటు నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ అందించేందుకు మేం 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొంటున్నాం. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, లాజిస్టిక్స్‌, పవర్‌ జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్, ఇతర తయారీ కార్యకలాపాల్లో సైబర్‌ సెక్యూరిటీ సేవలు అందించనున్నాం' అని అదానీ గ్రూప్‌ గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.


ప్రైవేటు నెట్‌వర్క్‌ సేవలు అందిస్తామని చెప్పినా మున్ముందు కన్జూమర్‌ మొబిలిటీ విభాగంలోకీ అదానీ గ్రూప్‌ వచ్చే అవకాశం లేకపోలేదని గోల్డ్‌మన్‌ సాచెస్‌ అంచనా వేసింది. వేలంలో స్పెక్ట్రమ్ ధరలు పెరుగుతాయని తెలిపింది.