Kakinada Farmers: పెద్ద ఎత్తున వర్షాలు పడినా, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారినా.. ఆ ప్రాంతంలో మాత్రం పంట పొలాలకు సాగు నీరు అందడం లేదు. కారణంగా పంట భూములన్నీ బీటలు వారాయి. అది చూసిన రైతులకు ఏం చేయాలో తెలియక కన్నీరు పెడుతున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న తాము ఏం చేయాలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. పంట పొలాల వద్దకు వెళ్లి నెర్రలు వారిని భూమిలో కూర్చొని తల్లడిల్లిపోతున్నారు. బతకడం కంటే చావడమే నయం అని అంటున్నారు.
ఆర్ఆర్బీ చెరువు ద్వారా 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం మల్లవరంలో సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో గల ఆడ్ ఆర్ బీ చెరువు ద్వారా గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి మండాల పరిధిలో పది గ్రామాల్లో ఉన్న సుమారు 20 వేల ఎకరాలు ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ఈ చెరువుపై ఆధారపడే అక్కడి ప్రజలు పంటలు సాగు చేస్తుంటారు. సాధారణంగా జూన్, జులై నెలలలో కురిసే వర్షాలతో పాటు పీబీసీ ద్వారా వచ్చే గోదావరి నీటితో చెరువులోకి సాగునీరు అందుతుంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడం, రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఏకే, ఏపీ మల్లవరం గ్రామాల్లోని రైతులు తమ పొలాలను దమ్ము చేసుకుని వెదజల్లు పద్ధతిలో వరిసాగును చేపట్టారు. రెండు వారాల వరకూ వర్షం ద్వారా లభించిన తడి సరిపోయింది.
ఐదు రోజుల ఎండకే బీటలు వారిన భూములు
అయితే గత ఐదు రోజులుగా ఎండలు మండిపోతుండడంతో.. ఆర్ ఆర్ బీ చెరువులో 13 తూములు ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో పంట ఎండిపోవడం ప్రారంభం అయింది. కొన్ని చోట్ల వరి పొలాలు బీటలు వారాయి. రెండు గ్రామాల్లో సుమారు 1400 ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.15 వేల వరకూ పెట్టుబడులు పెట్టామని... ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడే తమ జీవనం సాగుతుందని.. కానీ ఐదు రోజుల ఎండకే పంట భూములు నెరల వారాయని వాపోతున్నారు.
ఇరిగేషన్ అధికారులు ఏమయ్యారో తెలియడం లేదు
ఇరిగేషన్ అధికారులు సాగునీరుకు ఇబ్బంది ఉండదని చెప్పడంతో వర్షపు నీటిపై ఆధారపడి వెదజల్లు పద్ధతిలో వరి వేశామని... కానీ అధికారులు ఇప్పుడు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ నుంచి గోదావరి నీరు రావడం లేదని. ఏలేరు నీరు మళ్లించకపోవడంతో ఆర్ఆర్బీ చెరువుకు నీరు వచ్చే మార్గాలు కనిపించడం లేదని చెబుతున్నారు. పంట పొలాలు ఎండిపోవడమే కాకుండా పశువులకు తాగునీరు లభించని పరిస్థితి ఉందని అంటున్నారు. పొలాలకు సాగునీరు అందకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని స్పష్టం చేశారు. అసలు ఇరిగేషన్ అదికారులు ఎక్కడ ఉన్నారో కూడా తమకు తెలియడం లేదని.. బీటలు వారిని పొలాలు చూసైనా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.