Hardik Pandya: భారత్ - వెస్టిండీస్ మధ్య గయానా వేదికగా నిన్న రాత్రి ముగిసిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు.. 17.5 ఓవర్లలోనే దంచేసింది. సూర్యకుమార్ యాదవ్ (83) తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్)లు సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయం దక్కింది. అయితే నిన్నటి మ్యాచ్‌లో అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న తిలక్ వర్మకు నిరాశకు గురి చేస్తూ హార్ధిక్ పాండ్యా ఆఖర్లో సిక్సర్ కొట్టి అతడి ఆశలపై నీళ్లు చల్లాడు. హార్ధిక్ మ్యాచ్‌ను గెలిపించినా నెటిజన్లు మాత్రం అతడిపై ఫైర్ అవుతున్నారు.
సూర్య- తిలక్‌లు ధాటిగా ఆడటంతో మ్యాచ్‌లో భారత విజయం దాదాపు ఖాయమైంది. 17 ఓవర్లు ముగిసేసరికి భారత స్కోరు 154-3గా ఉంది. అప్పటికీ తిలక్ వర్మ 47 పరుగులతో హార్ధిక్ పాండ్యా 12 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. భారత విజయానికి ఆరు పరుగులు కావాల్సి ఉంది. పావెల్ వేసిన 18వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో హార్ధిక్ - తిలక్‌లు తలా రెండు సింగిల్స్ తీశారు. నాలుగో బాల్‌కు సింగిల్ తీయడంతో తిలక్ వ్యక్తిగత స్కోరు 49కు చేరాడు. మరొక్క పరుగు తీస్తే అతడి ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీల రికార్డు ఉండేది. అప్పటికీ భారత విజయం ఖరారై, చేతిలో ఏడు వికెట్లు ఉన్న సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ ఎవరైనా తిలక్ వర్మకు బ్యాటింగ్ ఇచ్చేవాడే. కానీ హార్ధిక్ పాండ్యా రూటే సెపరేటు కదా.. ఏదో ముంచుకొచ్చినట్టు ఐదో బాల్‌కు భారీ సిక్సర్ బాదాడు.
నువ్వా ధోని ఫాలోవర్‌వి..?
హార్ధిక్ పాండ్యా చాలాసార్లు తాను ధోని ఫాలోవర్‌ను అని, తనను మెంటార్‌లా భావిస్తానని చెప్పుకుంటాడు. కానీ ఫీల్డ్‌లో అతడి చేష్టలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయి. 2014 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వీరవిహారం చేయడంతో సఫారీలు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యం ఆవిరైపోయింది. ఆ మ్యాచ్‌లో రైనా నిష్క్రమించాక వచ్చిన ధోని.. 19వ ఓవర్లో ఆఖరు బంతికి సింగిల్ తీసే వీలున్నా మ్యాచ్‌ను కోహ్లీ ముగించాలనే ఉద్దేశంతో డిఫెన్స్ ఆడాడు. కోహ్లీ పరుగుకోసం వచ్చినా అందుకు నిరాకరించి.. ‘ఇది నువ్వే ఫినిష్ చేయాలి’ అన్నట్టుగా సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పటికీ వైరలే. తాజాగా హార్ధిక్ చేసిన పనితో నెటిజన్లు.. ‘ధోనీతో హార్ధిక్‌కు పోలికేంటి..? ఇది ధోనీ గొప్పతనం’ అని ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ధోనిది నిస్వార్థంగా ఉండే మనస్తత్వమైతే హార్ధిక్ మాత్రం స్వార్థపరుడని.. విజయం క్రెడిట్ తనకే దక్కాలనే ఆశతో ఫినిషర్ అనిపించుకోవాలనే ఆత్రుతతో ఇలా చేశాడని కారాలు మిరియాలు నూరుతున్నారు.
హార్ధిక్ ఇలా చేశాక ట్విటర్‌లో #Selfish ట్రెండింగ్‌లోకి వచ్చింది. సెల్ఫిష్ పాండ్యా అంటూ నెటిజన్లు హార్ధిక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. మ్యాచ్ గెలిచినందుకు సంతోషమే గానీ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్న ఆటగాడికి అండగా నిలవాల్సింది పోయి ఫినిషర్ అనిపించుకోవాలనే ఆత్రుతలో ఇలా చేయడమేంటని నిందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial